Begin typing your search above and press return to search.

12 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ రీఎంట్రీ

By:  Tupaki Desk   |   18 Oct 2015 5:30 PM GMT
12 ఏళ్ల తర్వాత ఆ డైరెక్టర్ రీఎంట్రీ
X
పుష్కరం వెనక్కి వెళ్తే అప్పట్లో.. తెలుగు, తమిళ భాషల్లో ఓ క్రేజీ సినిమా వచ్చింది. తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ పేరుతో, తమిళంలో ‘యనక్కు 20, ఉనక్కు 18’ అనే టైటిల్ తో ఆ సినిమా విడుదలైంది. తరుణ్ - త్రిష - శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. అప్పటికి నిర్మాతగా టాప్ గేర్ లో ఉన్న ఎ.ఎం.రత్నం తన పెద్ద కొడుకు జ్యోతికృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తీసిన సినిమా ఇది. ఎ.ఆర్.రెహమాన్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించాడు. ఇంకా పెద్ద పెద్ద టెక్నీషియన్లే పని చేశారు ఈ సినిమాకు. హీరో హీరోయిన్లందరూ కూడా అప్పటికి మంచి క్రేజ్ ఉన్న వాళ్లే కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైందా సినిమా. కానీ ఫలితం మాత్రం ఇంకోలా వచ్చింది. సినిమా డిజాస్టర్ అనిపించుకుంది.

కట్ చేస్తే.. జ్యోతికృష్ణ దశాబ్దానికి పైగా ఎక్కడా కనిపించ లేదు. ఈ టైంలో ఎ.ఎం.రత్నం కూడా ఫేడవుటైపోయాడు. సూర్యా మూవీస్ బేనరే కనిపించట్లేదు. ఈ మధ్యే వేరే బేనర్ మీద మళ్లీ ఒకటీ అరా సినిమాలు చేసుకుంటూ నెట్టుకొస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో రత్నం పెద్ద కొడుకు మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి తయారవుతున్నాడు. 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ తెలుగులోనే సినిమా చేయడానికి అతను ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. మన యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా సినిమా చేయడానికి అతను సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇటీవలే గోపీకి కథ కూడా చెప్పి ఓకే చేయించుకున్నాడట. ప్రస్తుతం స్క్రిప్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు కుర్రాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రకటన రాబోతోంది.