Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : జ్యోతిలక్ష్మీ

By:  Tupaki Desk   |   12 Jun 2015 10:06 AM GMT
సినిమా రివ్యూ : జ్యోతిలక్ష్మీ
X
రివ్యూ: జ్యోతిలక్ష్మీ
రేటింగ్‌: 2.5 /5
తారాగణం: ఛార్మి, సత్య, బ్రహ్మానందం, రామ్‌ రెడ్డి తదితరులు
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
ఛాయాగ్రహణం: పి.జి.విందా
నిర్మాతలు: శ్వేత లానా, వరుణ్‌, తేజ, సీవీ రావు
కథ: మల్లాది వెంకటకృష్ణమూర్తి
స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

హీరోయిన్‌గా ఛార్మి పూర్తిగా ఫేడవుట్‌ అయిపోయిన దశలో పూరి జగన్నాథ్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ ఆమెతో ఓ లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేయడం పెద్ద విశేషమే. ఈ విచిత్రమైన కాంబినేషన్‌ సెట్‌ కావడంతోనే 'జ్యోతిలక్ష్మీ'కి క్రేజ్‌ వచ్చేసింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి ఎప్పుడో 40 ఏళ్ల కిందట రాసిన మిసెస్‌ పరాంకుశం అనే నవలను ప్రస్తుత కాలానికి తగ్గట్లు పూరి మోడర్నైజ్‌ చేసి తీసిన సినిమానే 'జ్యోతిలక్ష్మీ'. సినిమా మీద ఆసక్తి కలిగించడంలో విజయవంతమైన పూరి.. సినిమాను కూడా అంతే ఆసక్తికరంగా తెరకెక్కించాడో లేదో చూద్దాం.

కథ:

జ్యోతిలక్ష్మీ (ఛార్మి) ఓ వేశ్య. ఆమెను ఓ మార్కెట్లో చూసి పడిపోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సత్య (సత్య).. తన కోసం నగరంలో ఉండే వేశ్యాగృహాలన్నీ తిరుగుతాడు. చివరికి ఓచోట ఆమెను పట్టుకుంటాడు. రోజూ జ్యోతిలక్ష్మీ కోసం అక్కడికి వెళ్లే సత్య ఓ రోజు ఆమెను ప్రేమిస్తున్నానంటాడు. ముందు నవ్వి ఊరుకున్నా తర్వాత తనతో కలిసి బయటికి వచ్చేస్తుంది జ్యోతిలక్ష్మీ. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. ఐతే ఆమెతో అప్పటిదాకా బిజినెస్‌ చేసిన గ్యాంగ్‌ ఆమె మీద అటాక్‌ చేస్తుంది. తనను ప్రశాంతంగా బతకనివ్వదు. అలాంటి స్థితిలో జ్యోతిలక్ష్మీ ఏం నిర్ణయం తీసుకుంది? తనలా బాధపడుతున్న అమ్మాయిల్ని రక్షించడానికి ఏం చేసింది? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

జ్యోతిలక్ష్మీ కథ ఏమై ఉంటుందో అంచనా వేయడం పెద్ద కష్టమేం కాదు. అందుకే ఈ విషయంలో ఏమీ దాచలేదు పూరి. కథేంటన్నది ముందే చూచాయిగా చెప్పేశాడు. ముందే కథ చెప్పినపుడు కథనంలో ఎంతో బలం ఉంటే తప్ప ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కష్టం. 37 రోజుల్లో తీసేసినంత మాత్రాన పూరి ఏదో మొక్కుబడిగా చుట్టేసి ఉంటాడని అనుకోలేదు జనాలు. డర్టీ పిక్చర్‌ స్థాయిలో కాకపోయినా.. పూరి తీశాడు కాబట్టి 'జ్యోతిలక్ష్మీ'లోనూ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందనే ఆశించారు జనాలు. కానీ ఆ ఆశల్ని నెరవేర్చలేకపోయాడు పూరి. నిజంగానే మొక్కుబడిగా చుట్టేసినట్లే ఉంది తప్పితే.. జ్యోతిలక్ష్మీ మీద పూరి అంతగా దృష్టిపెట్టినట్లు లేదు. ఏదో అలా మేకప్‌ చేసి పైపై మెరుగులతో మేనేజ్‌ చేయడం తప్పితే.. లోతుల్లోకి వెళ్లలేకపోయాడు పూరి.

ఇలాంటి సినిమాలకు ప్రధానంగా ఎమోషన్స్‌ పండటం కీలకం. ప్రధాన పాత్ర మీద మనకి జాలి కలగాలి. తనతో ఎమోషనల్‌గా కనెక్టవ్వాలి. హీరో పసివాడిగా ఉన్నపుడు అతణ్నో వేశ్య ఆదరిస్తుంది. అప్పుడే ఫిక్సయిపోతాడు తనో వేశ్యను పెళ్లి చేసుకోవాలని. కట్‌ చేస్తే ఇతనో పేద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిపోతాడు. ఇతను ఆఫీస్‌లో కాకుండా మార్కెట్లో కూర్చుని ల్యాప్‌టాప్‌ కెలుకుతుంటే జ్యోతిలక్ష్మీ కార్లోంచి దిగి కస్టమర్‌ దగ్గర డబ్బులు తీసుకుంటూ కనిపిస్తుంది. తర్వాత పక్కనున్న అనాథలకు డబ్బులిచ్చి వెళ్తుంది. అంతే మనోడు ఫ్లాట్‌. ఇదంతా ఓ ఫ్లాష్‌బ్యాక్‌లో చూపిస్తాడు పూరి. అంతా అయ్యాక నీలో నాకు మా అమ్మ కనిపించింది అంటాడు హీరో. వెనుక గుండెలు పిండేస్తున్నట్లు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌. ఈ పది నిమిషాల ఫ్లాష్‌ బ్యాక్‌ చూస్తుంటే మనం 2015లోనే ఉన్నామా అని ఓసారి గిల్లి చూసుకోవాల్సి వస్తుంది. మరీ ఇంత సినిమాటిక్‌గా, డ్రమటిక్‌గా సన్నివేశాలుంటే ఈ కాలం ప్రేక్షకులు ఆ పాత్రలతో ఎలా కనెక్ట్‌ అవుతారనుకున్నాడో పూరి.

హీరో సంగతలా ఉంచి.. హీరోయిన్‌ జ్యోతిలక్ష్మీ కథ చూద్దాం. హీరో ఒక్కసారి కూడా తనను ముట్టుకోకుండా తనను వ్యభిచారం నుంచి బయటపడేసి.. ఇంటికి తీసుకెళ్తే అతడి అక్క ఉందని కూడా చూడకుండా ''రా కలిసి పడుకుందాం'' అంటుంది. ఫస్ట్‌ నైట్‌లో ''వదినా మీ తమ్ముడు మామూలోడు కాదు'' అంటూ సాంగేసుకుంటుంది. హీరో అక్కేమో ఆ మాటలు తట్టుకోలేక చెవులు మూసుకుంటూ ఉంటుంది. చివరికి కండోమ్‌ వాడలేదని బయటికొచ్చేసి తాళి తీసి హీరో మొహాన కొడుతుంది. ఇదీ హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌. మల్లాది వారు ఏం రాశారో కానీ.. పూరి జగన్నాథ్‌ మాత్రం తన 'ట్రెండీ' ఆలోచనలతో ఇంత గొప్పగా జ్యోతిలక్ష్మీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దాడు. పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌ గౌరవమిచ్చే వరకు తన జీవితంలో వచ్చిన మార్పును గ్రహించలేనంత అమాయకురాలిగా హీరోయిన్‌ క్యారెక్టర్‌ను చూపించడం పూరికే చెల్లింది.

ఫస్టాఫ్‌లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అర్థం లేని సన్నివేశాలతో ఊరికే సాగతీత తప్ప. సెకండాఫ్‌ కొంచెం గడిచాక పూరిలోని డైరెక్టర్‌ కొంచెం నిద్ర లేచాడు. జ్యోతిలక్ష్మీ సమస్యకు చూపించిన సినిమాటిక్‌ పరిష్కారం మాస్‌ ఆడియన్స్‌ను అలరిస్తుంది. అప్పటిదాకా జ్యోతిలక్ష్మీ రాకెట్‌ను నడిపిన రౌడీలు ఆమెకు ఎందుకు సహకరిస్తారు అన్న లాజిక్‌ పక్కనబెడితే.. వాళ్ల సాయంతో అమ్మాయిలతో రాసలీలలు సాగించే మగాళ్ల బండారాల్ని వీడియోల్లోకి ఎక్కించడం.. చివర్లో అందరినీ నిలబెట్టి సెటిల్‌మెంట్లు చేయడం.. మెయిన్‌ విలన్‌ను కాల్చిచంపడం.. ఈ సన్నివేశాలన్నీ టార్గెటెడ్‌ ఆడియన్స్‌కు నచ్చేలా తీశాడు పూరి. దేవుళ్లకు కూడా అమ్మాయిలంటే చిన్నచూపు.. అందుకే అమ్మాయిల్ని కనలేదు.. అంటూ తనదైన శైలిలో డైలాగు పేల్చాడు పూరి చివర్లో. ఇక్కడే పూరి ముద్ర కనిపిస్తుంది. ఐతే ఆ ముద్ర సినిమా అంతటా కనిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో.

నిజానికి జ్యోతిలక్ష్మీ పాత్రతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్టయ్యేలా ఆ క్యారెక్టర్‌ను, హీరో పాత్రను తీర్చిదిద్దేందుకు అవకాశం లేకపోలేదు. ఐతే పూరి ఆ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించలేదు. క్లైమాక్స్‌తో కొట్టేద్దాం.. మిగతావన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు అని హడావుడిగా బండి లాగించేసినట్లు ప్రతి ఫ్రేమ్‌లోనూ తెలిసిపోతుంది.

నటీనటులు:

ఛార్మి మంచి నటే సందేహం లేదు. కానీ పూరి చెబితే చేసిందో లేక సొంత ఆలోచ కానీ.. చాలా సన్నివేశాల్లో ఆమె ఓవరాక్షన్‌ చేసింది. హీరో హీరో తనను వ్యభిచారం నుంచి బయటపడేశాక అతడి ఇంటికి వెళ్లి చేసే ఓవరాక్షన్‌ను భరించడం చాలా కష్టం. అవసరం లేని అతి ఎక్స్‌ప్రెషన్స్‌ అవి. ఐతే చివరి అరగంటలో మాత్రం ఛార్మి నటన ఓకే. ఛార్మిని గ్లామరస్‌గా చూపించడానికి పూరి చాలా ప్రయత్నమే చేశాడు కానీ.. ఆమెలో మునుపటి ఛార్మ్‌నెస్‌ మిస్‌ కావడం వల్ల పెద్దగా ఆకట్టుకోలేదు. హీరోగా చేసిన సత్య మెప్పించాడు. అతడికి మంచి వాయిస్‌ ఉంది. నటనలో టైమింగ్‌ కూడా బాగుంది. కొత్త అయినా తడబాటు కనిపించలేదు. క్యారెక్టర్‌ వీక్‌ కానీ.. అవకాశమిస్తే అతను ఇంకా బాగా చేసేవాడేమో. బ్రహ్మానందం పర్వాలేదు. రెండు మూడు సన్నివేశాల్లో నవ్వించాడు. విలన్‌గా చేసిన సీరియల్‌ నటుడు ఆ స్థాయిలోనే కొంచెం అతిగా నటించాడు. హీరో ఫ్రెండుగా చేసిన కుర్రాడి నటన బాగుంది. రామ్‌ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిందేం లేదు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్‌ టీమ్‌ జస్ట్‌ ఓకే అనిపించే ఔట్‌పుట్‌ ఇచ్చారు. సునీల్‌ కశ్యప్‌ పాటల్లో టైటిల్‌ సాంగ్‌, బీచ్‌ సాంగ్‌ బాగున్నాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. పి.జి.విందా కెమెరా పనితనం మామూలుగా ఉంది. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడ్డ సంగతి చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. పూరి జగన్నాథ్‌ మాటల మెరుపులు పెద్దగా కనిపించలేదు. దర్శకుడిగా ఆయన ముద్ర కూడా సినిమాలో మిస్‌ అయింది.

చివరిగా...

ఎమోషనల్‌గా జ్యోతిలక్ష్మీతో కనెక్టవడం కష్టం. మాస్‌ను మెప్పించే మసాలా ఉండటం కలిసొచ్చే అంశం. 'జ్యోతిలక్ష్మీ' ఫేట్‌ ఏంటో ఆ వర్గం ప్రేక్షకులే నిర్ణయించాలి.