Begin typing your search above and press return to search.

జ్యోతిక స్పీచ్ విని క‌లెక్ట‌ర్ ఆదేశాలు!

By:  Tupaki Desk   |   25 April 2020 5:34 AM GMT
జ్యోతిక స్పీచ్ విని క‌లెక్ట‌ర్ ఆదేశాలు!
X
లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంటోంది జ్యోతిక‌. చంద్ర‌ముఖిగా ఇప్ప‌టికీ తెలుగు వారి గుండెల్లో నిలిచి ఉన్న ఈ ట్యాలెంటెడ్ న‌టి.. త‌మిళ స్టార్ హీరో సూర్య‌ను పెళ్లాడి ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లి అయినా ఇంకా అదే ఎన‌ర్జీతో క‌థానాయిక‌గానూ రాణిస్తున్నారు. ఇటీవ‌ల జ్యోతిక న‌టించిన సినిమాలు వ‌రుస‌గా తెలుగులోనూ రిలీజవుతున్నాయి. జ్యోతిక న‌టించిన ర‌చ్చాసి త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో హెడ్ మిస్ట్రెస్ గా క‌లెక్టర్ స్థాయి అధికారిని ప్రేరేపించే పాత్ర‌లో క‌నిపించి ప్ర‌శంస‌లు అందుకుంది.

ఇక రియాలిటీలోనూ క‌లెక్ట‌ర్ ని ప్ర‌భావితం చేసే స్పీచ్ తో జ్యోతిక అద‌ర‌గొట్టేయ‌డంపై తమిళ‌నాట హాట్ టాపిక్ అయ్యింది. జ్యోతిక ఇటీవల ఒక అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ.. తంజావూరు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆమె ఆ దేవాల‌య సొగ‌సుకు ఆకర్షితురాల‌య్యాన‌ని.. దీనిని ప్రభుత్వం ఒక అద్భుత‌మైన‌ ప్యాలెస్ లాగా ఎలా నిర్వహిస్తోందో! అంటూ సెటైర్ వేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఆ సంగ‌తి చెబుతూనే.. ఓ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో షూటింగ్ జ‌రుగుతున్నప్పుడు అక్క‌డ‌ పరిస్థితిపైనా జ్యోతిక పంచ్ వేసారు. గుడితో పోలిస్తే ఆ ఆస్ప‌త్రి ప‌రిస‌రాలు ఎంతో ధైన్యంగా ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులు- పాఠశాలలను దేవాలయాల మాదిరిగానే నిర్వహించాలని ఆమె గట్టి అభ్యర్థన చేయ‌డం అధికారుల్లో చ‌ర్చ‌కొచ్చింది. అస‌లు ఫ‌లానా రాష్ట్ర ప్ర‌భుత్వం అన్న పేరెత్త‌కుండానే ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌ట్టింది. దేవాల‌యాల సొగ‌సు కోసం పెట్టే దృష్టి పాఠ‌శాల‌లు- ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల అభివృద్ధిపై పెట్ట‌లేరు అంటూ సెటైర్ వేసారు జ్యోతిక‌.

జ్యోతిక-శశికుమార్ జంట‌గా శరవణన్ ద‌ర్శ‌క‌త్వం లో ఓ సినిమా ప్ర‌స్తుతం సెట్స్ పై ఉంది. తంజావూర్ లో ఇదివ‌ర‌కూ షూటింగ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శ‌ర‌వ‌ణ‌న్ సైతం జ్యోతిక‌కు మ‌ద్ధ‌తునిస్తూ మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు పిల్లలను ప్రసవించడానికి సరైన సౌకర్యాలు లేవు.. క‌నీసం గ‌ర్భం దాల్చే చోట ఆస్ప‌త్రిలో సౌక‌ర్య‌మే లేదని ఆయ‌న‌ స్పష్టం చేశారు. ఈ ఉదంతం అనంత‌రం.. ఆ ఆసుపత్రి ప్రాంగణంలో తనిఖీ చేయమని సౌక‌ర్యాలు పెంచ‌మ‌ని తంజావూరు జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో జ్యోతిక ప్రసంగంపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. గుడులు గోపురాల సోకుల‌కేమీ త‌క్కువేం కాదు. అయితే ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు దోహ‌ద‌ప‌డే పాఠ‌శాల‌లు.. ఆస్ప‌త్రుల గురించే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఇది కేవ‌లం త‌మిళ‌నాడుకే చెందిన స‌మ‌స్య కానే కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ప‌రిస్థితి. వీధివీధినా గుడులు గోపురాలు క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి కానీ ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో దోమ‌లు కొట్టుకోవ‌డం చూస్తుంటాం. పాఠ‌శాల‌ల ప‌క్క‌నే మ‌రుగుదొడ్లు క‌నిపిస్తుండ‌డం ఆవేద‌న క‌లిగిస్తుంటుంది. అయితే ఇలాంటి అవ్య‌వ‌స్థ‌పై సెటైర్ వేసే ధైర్యం చేయ‌డం జ్యోతిక గొప్ప‌త‌నం అని ప్ర‌శంసించాలి. అయితే జ్యోతిక సెటైర్ ని ఆపాదిస్తూ కొంద‌రు మ‌తాల‌కు సంబంధించిన ఉద్వేగాల్ని ట‌చ్ చేస్తున్నారు. జ్యోతిక ఇలా గుడుల్ని విమ‌ర్శించారు కానీ.. మ‌సీదుల్ని.. చ‌ర్చిల్ని విమ‌ర్శించ‌గ‌ల‌రా? అంటూ సోష‌ల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు కూడా క‌నిపిస్తున్నాయి. అయితే ఇది స‌మ‌స్య గుడా చ‌ర్చా అన్నది కాదు.. రాజ‌కీయ సామాజిక‌‌ అవ్య‌వ‌స్థ‌కు సంబంధించిన అవ‌స్థ అన్న‌ది అర్థం చేసుకోవాలి.