Begin typing your search above and press return to search.

KRR క్లాస్ రూమ్.. మొదటి పాఠం ఇదే

By:  Tupaki Desk   |   11 Jun 2016 7:07 AM GMT
KRR క్లాస్ రూమ్.. మొదటి పాఠం ఇదే
X
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. కేఆర్ ఆర్ క్లాస్ రూమ్ అంటూ ప్రారంభిస్తానని అనగానే ఏం చెబుతారా అనే ఆసక్తి నెలకొంది. అసలు.. అయనతోపాటు ఇండస్ట్రీలో ఉన్న దగ్గుబాటి సురేష్ బాబు - నాగార్జున లాంటి వారంతా ఫిలిమ్ స్కూల్స్ పేరుతో లక్షలు ఛార్జ్ చేస్తుంటే.. ఆయన మాత్రం ఉచితంగా క్లాస్ రూమ్ అంటూ సినిమా తీసేందుకు ఔత్సాహికులకు పాఠాలు చెబుతానడం విశేషంగా చెప్పాలి.

కేఆర్ ఆర్ క్లాస్ రూమ్ మొదటి ఎపిసోడ్ ను.. 'అందరికి థ్యాంక్స్ చెప్పడమే దైవ ప్రార్ధన' అంటూ ప్రారభించిన రాఘవేంద్ర రావు.. 'ఇందులో థియరీ ఉండదు - సిలబస్ ఉండదు

నా వంద సినిమాల ఎక్స్ పీరియన్స్ నే పాఠాలుగా చెబుతా' అని చెప్పారు. అలాగే ఫస్ట్ ఎపిసోడ్ కు గాను.. డైరెక్టర్ అవడానికి కావాలసిన లక్షణాలు ఏంటి?.. తానెలా డైరెక్టర్ అయ్యాను? అనే సంగతులను పంచుకున్నారు.

'పరీక్షలయినా ఆటల్లో అయినా గెలవాలనే పట్టుదల ఉంటుంది.. అలాగే ఎన్ని కష్టాలొచ్చినా గెలవాలనే పట్టుదల దర్శకుడు కావాలని అనుకునేవారికి ఉండాలి. అలాగే క్రియేటివిటీ ఉండాలి. సీన్ లో ఎమోషన్ ని అర్ధం చేసుకోవాలి. కథను వింటూ దృశ్యం ఊహించుకోవాలి, మైండ్ లో స్టోరీ బోర్డ్ వేసుకోవాలి' అని చెప్పారు కేఆర్ ఆర్.

'స్క్రిప్ట్ ను చూసి అర్ధం చేసుకోవాలి.. ఏ షాట్ ఎందుకో అసిస్టెంట్ డైరెక్టర్ అర్ధం చేసుకోవాలి.. అన్ని సీన్ లో మైండ్ లో ఊహించుకుని సిద్ధం కావాలి.. నేనైతే ఎలా తీస్తాను అని ఊహించుకోవాలి.. కెమెరామన్ కు దగ్గరగా ఉండిఏ షాట్ ఎందుకో ఎలా తీస్తారో తెలుసుకోవాలి.. రైటర్ తో సన్నిహితంగా ఉంటే స్టోరీలో ఉండే ఫీల్ అర్ధమవుతుంది.. మ్యూజిక్ డైరెక్టర్ - ఆర్ట్ డైరెక్టర్.. అందరితో సన్నిహితంగా ఉంటే అన్ని విభాగాలపై పట్టు వస్తుంది' అన్నారు రాఘవేంద్రరావు.

ఇక నేనెలా డైరెక్టర్ అయ్యాను అనే పాఠానికి సంబంధించి.. 'మా నాన్న పెద్ద డైరెక్టర్.. అప్పటి నుంచి నాకు డైరెక్టర్ అవాలనే కోరిక ఉండేది. నేను మద్రాస్ లో ఉన్నపుడు సినిమాలు చూశాక.. నచ్చిన సీన్స్ ఉంటే.. ఆ షాట్ ని ఎలా తీయాలి - ఎలా బాగా తీయాలి - ఆ సీన్స్ ని ఎలా ఎడాప్ట్ చేయాలనే ఆలోచించేవాడిని.. నాన్న కమర్షియల్ సక్సెస్ కాలేకపోయారు.. ప్రకాష్ స్టూడియోస్ అంటూ నాన్న పేరుపైనే బ్యానర్ ప్రారంభించాలని భావించాను. నాన్న దగ్గర అసిస్టెంట్ గా చేరి.. డైరెక్టర్ గారి అబ్బాయిగా కాకుండా.. అందరితో కలిసిపోయి ఉండేవాడిని' అంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుుకున్నారు.

'మొత్తం రైటప్ చూసి అంతా ఇలా ఉంటుందని ఊహించుకునే వాడిని. అక్కడ ఉన్నట్లుగా కాకుండా నాన్న వేరేలా తీసేవారు. నాకు కోపం వచ్చేది. డైరెక్టర్ ఆయనయితే నాకెందుకు కోపం అనిపించేది కాదు. కానీ తీశాక చూస్తే మాత్రం.. ఆయన తీసిందే నచ్చేది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే డైరెక్షన్ నేర్చుకోవడం అనేది ఎండ్ లెస్' అన్నారాయన.

చివరగా సరదాగా మీకో క్విజ్ అంటూ ఓ పజిల్ విసిరారు. టేబుల్ పై ఉంచిన నంది అవార్డ్.. క్యాష్ ఎందుకు ఉంచానో ఊహించాలని సవాల్ విసిరారు. మీరు ఊహించినది నేను అనుకున్నది కరెక్ట్ అవుతుందేమో చూద్దామంటూ కేఆర్ఆర్ క్లాస్ రూమ్ లో మొదటి ఎపిసోడ్ ని ముగించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.