Begin typing your search above and press return to search.

నేనే కేఏపాల్‌ సాంగ్‌.. వర్మ మార్క్‌ కౌంటర్‌

By:  Tupaki Desk   |   2 Nov 2019 8:50 AM GMT
నేనే కేఏపాల్‌ సాంగ్‌.. వర్మ మార్క్‌ కౌంటర్‌
X
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అందులో ఉండే కంటెంట్‌ కంటే ఆ సినిమాపై వచ్చే విమర్శలు వివాదాల గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈమద్య తన ప్రతి సినిమాకు కూడా వివాదాలతోనే తెగ పబ్లిసిటీ దక్కించుకుంటున్న వర్మ రానురాను మరీ వివాదాస్పద సినిమాలే చేస్తున్న విషయం తెల్సిందే. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం తర్వాత వర్మ చేస్తున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రంలో ఏపీ రాజకీయ నాయకులందరిని కూడా కవర్‌ చేస్తున్నాడు. చివరకు కేఏపాల్‌ ను కూడా వర్మ వదల్లేదు.

మొన్నటి ఎన్నికల సమయంలో అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ పంచిన వినోదం అంతా ఇంతా కాదు. ఆయన వీడియోలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యి తెగ నవ్వు తెప్పించాయి. ఇక ఎన్నికల సమయంలో వర్మను పాల్‌ కెలికి వదిలాడు. అప్పటి నుండి కూడా పాల్‌ పై ఏదో ఒక రకంగా కౌంటర్‌ వేస్తూనే ఉన్నాడు. ఇక తన తాజా చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ఏకంగా కేఏపాల్‌ పై కౌంటర్స్‌ వేస్తూ పాటనే పెట్టాడు.

ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్న ఈ చిత్రంలోని నేనే కేఏపాల్‌ పాటను విడుదల చేశాడు. నిన్ననే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన వర్మ అందరి దృష్టిని ఆకర్షించాడు. 2024 ఎన్నికల్లో చిన్న చిన్న నాయకులు అయిన జగన్‌.. పవన్‌.. చంద్రబాబు నాయుడులు తన టార్గెట్‌ కాదని కేంద్రంలో మోడీ తన టార్గెట్‌ అని ప్రధాని అయ్యి 150 దేశాల ప్రధానులను నా ప్రమాణ స్వీకారానికి పిలుస్తాను విత్‌ ఫ్యామిలీ అంటూ పాటలో చెప్పించిన డైలాగ్‌ నవ్వు తెప్పిస్తుంది.

సిరాశ్రీ రచించిన ఈ పాటను రవిశంకర్‌ ట్యూన్‌ చేశాడు. కేఏపాల్‌ కు సంబందించిన కొన్ని ఫొటోలతో ఈ పాట వీడియోను తయారు చేసి వర్మ విడుదల చేశాడు. వర్మ మార్క్‌ కౌంటర్స్‌ తో ఈ పాట సాగింది. ఈ పాట గురించి వర్మ ముందే ప్రకటించడంతో అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని గంటల్లోనే ఈ పాట దాదాపుగా రెండు లక్షల వ్యూస్‌ ను సొంతం చేసుకోవడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈ సినిమాకు సంబంధించి మరెన్ని సంచలన విషయాలను వర్మ మీడియా ముందుకు తీసుకు వస్తాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వర్మ చేస్తున్న ఈ సినిమాను పాటలను కొందరు ఎంజాయ్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం మండి పోతున్నారు.