Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘కాశి’

By:  Tupaki Desk   |   18 May 2018 9:34 AM GMT
మూవీ రివ్యూ: ‘కాశి’
X
చిత్రం: ‘కాశి’

నటీనటులు: విజయ్ ఆంటోనీ - అంజలి - సునైనా - అమృత అయ్యర్ - శిల్ప మంజునాథ్ - జయప్రకాష్ - నాజర్ - యోగిబాబు - ఆర్.కె.సురేష్ తదితరులుు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్
మాటలు: భాష్యశ్రీ
నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ
రచన - దర్శకత్వం: కృతిగ ఉదయనిధి

తమిళ సినిమాల్లో సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు విజయ్ ఆంటోనీ.‘బిచ్చగాడు’ సినిమాతో అతడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఐతే ఆ సినిమా తెచ్చిన గుర్తింపును ఆ తర్వాత వచ్చిన విజయ్ సినిమాలు నిలబెట్టలేదు. అవి నిరాశ పరిచాయి. ఇప్పుడు విజయ్ ‘కాశి’ అవతారం ఎత్తాడు. ‘బేతాళుడు’ తరహాలోనే విడుదలకు ముందే తొలి ఏడు నిమిషాల సినిమాను రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించాడు విజయ్. మరి ఈ చిత్రం ఆ ఆసక్తిని ఏమేరకు నిలబెట్టిందో చూద్దాం పదండి.

కథ:

భరత్ (విజయ్ ఆంటోనీ) అమెరికాలో పేరు మోసిన డాక్టర్. అతడి ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రి అమెరికాలోనే ది బెస్ట్ అనిపించుకునే దిశగా సాగుతుంటుంది. ఐతే భరత్ జీవితం చాలా సంతోషంగా సాగిపోతుంటుంది కానీ.. చిన్నతనం నుంచి ఒక పీడకల అతడిని వెంటాడుతూ ఉంటుంది. అదెందుకన్నది అతడికి అర్థం కాదు. ఐతే ఒక సందర్భంలో తన తల్లిదండ్రులకు తాను సొంత కొడుకును కాదని.. వాళ్లు తనను దత్తత తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో తన మూలాలేంటో తెలుసుకోవడానికి ఇండియాకు బయల్దేరతాడు భరత్. ఇంతకీ అతడి గతమేంటి.. అతడిని వెంటాడుతున్న కల వెనుక నేపథ్యమేంటి.. ఇండియాకు వచ్చాక అతడి జీవితం ఎలా మలుపు తిరిగింది అన్నది మిగా కథ.

కథనం - విశ్లేషణ:

విజయం సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కష్టమంటారు. విజయ్ ఆంటోనీని చూస్తే అదే నిజమనిపిస్తుంది. ‘బిచ్చగాడు’ సినిమాతో అతను తెలుగులో గొప్ప విజయాన్నందుకున్నాడు. అనామకుడిగా తెలుగులోకి అడుగుపెట్టి తిరుగులేని గుర్తింపును సంపాదించాడు. అతడి సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భరోసా కలిగించాడు. అందుకే ఆ తర్వాత అతను నటించిన ‘బేతాళుడు’పై విపరీతమైన ఆసక్తిని చూపించారు తెలుగు ప్రేక్షకులు. కానీ ఆ సినిమాతో అంచనాల్ని అందుకోలేకపోయాడు విజయ్. ఇక అక్కడి నుంచి ‘యమన్’.. ‘ఇంద్రసేన’.. ఇలా సినిమా సినిమాకూ ఈ నమ్మకం మరింతగా సడలిపోతూ వచ్చింది. ప్రతి సినిమాకూ కొన్ని మెట్లు దిగుతూ వచ్చిన విజయ్.. ఇప్పుడు ‘కాశి’తో పాతాళానికి పడ్డాడు. ‘బిచ్చగాడు’తో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల్లో ఏమాత్రమైనా మిగిలి ఉంటే.. దాన్ని పూర్తిగా తుడిచేస్తుంది ‘కాశి.

‘కాశి’ సినిమాలో తొలి ఏడు నిమిషాల సన్నివేశాల్ని విడుదలకు ముందే పంచుకుని ఈ చిత్రంపై ఆసక్తి రేకెత్తించగలిగాడు విజయ్ ఆంటోనీ. దీన్ని ఒక వంచనగానే భావించాలి. సరిగ్గా ఏడు నిమిషాలే ఎందుకు ఇలా లీక్ చేశారో సినిమా చూశాక అర్థమవుతుంది. సినిమాలో ఏమైనా ఆసక్తి రేకెత్తించే విషయం ఉందంటే.. అది ఆ ఏడు నిమిషాలు మాత్రమే. ఆ ఏడు నిమిషాలు గడిచాక మొదలవుతుంది హింస (ఇది పెద్ద మాటేమీ కాదు).. ఇక అది ఎండ్ టైటిల్స్ పడే వరకు ఆగదు. అసలీ సినిమా ఉద్దేశమేంటో.. దీన్ని ఎందుకు తీశారో.. అన్న సందేహాలు ఆద్యంతం ప్రేక్షకుల మెదళ్లను తొలిచేస్తుంటాయి.

తన పుట్టుక.. తన గతం.. తన తల్లిదండ్రుల గురించి తెలుసుకోవడానికి ఒక కొడుకు చేసే ప్రయత్నమే ఈ చిత్రం. కానీ ఆ ప్రయాణంలో కథ సంబంధం లేకుండా ఎక్కడికెక్కిడో వెళ్తుంది. అదెంత అసంబద్ధంగా ఉంటుందో ఒక ఉదాహరణ చెప్పుకుందాం. తన తండ్రి ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో హీరోకు ఒక్కొక్కరి మీదా సందేహం కలుగుతుంది. ఆ వ్యక్తిని కలిసి తన గతం గురించి అడుగుతాడు. అతను కథ ఆరంభించగానే.. ఫ్లాష్ బ్యాక్ లో ఆ పాత్రలోకి విజయ్ దూరిపోతాడు. ఇంతకుముందు సిద్దార్థ్ నటించిన ‘బావ’ సినిమాలో తన తండ్రి అయిన రాజేంద్ర ప్రసాద్ కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో సిద్ధు కనిపించడం గుర్తుండే ఉంటుంది. ఐతే అక్కడ తండ్రీ కొడుకుల్ని అలా చూస్తాం.

కానీ ఇక్కడ అనామకులైన వ్యక్తుల్ని కలుస్తూ వాళ్లలో తన తండ్రిని చూసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి హీరో ఎగిరిపోతాడు. మనం వర్తమానంలో చూస్తున్న వ్యక్తులకు.. వాళ్ల గతాలకు అసలు పొంతన ఉండదు. ఇక్కడా అక్కడా ప్రతిసారీ విజయ్ ఆంటోనీని చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది. నిజానికి విజయ్ ఆంటోనీకి నటుడిగా చాలా పరిమితులున్నాయి. వాటి గురించి పట్టించుకోకుండా అతనేమో ప్రతి పాత్రలోనూ తనే కనిపించాలని.. స్క్రీన్ మొత్తాన్ని తనే ఆక్రమించేయాలని చూశాడు. కానీ అతను చేసిన ఏ పాత్రా అంతగా ఆకట్టుకోదు. ఒక్కో ఫ్లాష్ బ్యాక్ ఒక్కో ప్రహసనంగా నిలుస్తుంది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. సీరియల్ ను తలపించేలా విపరీతమైన సాగతీతో.. ఏ ప్రత్యేకతా లేని మామూలు సన్నివేశాలతో నడిచే మూడు ఫ్లాష్ బ్యాక్ లు చూసేసరికి మూడు సినిమాలు చూసిన భావన కలుగుతుంది. చివర్లో అయినా ఏదైనా ట్విస్టు ఉంటుందేమో.. అదైనా ఆసక్తి రేకెత్తిస్తుందేమో అని చూస్తే అక్కడా నిరాశే. చాలా పేలవంగా సినిమాను ముగించారు. నిడివి రెండుంబావు గంటలే అయినా.. ఏమాత్రం ఆసక్తి లేకుండా నత్తనడకన సాగే ఈ సినిమాను భరించడానికి చాలా ఓపిక కావాలి.

నటీనటులు:

విజయ్ ఆంటోనీ నిరాశ పరిచాడు. తనకు తగ్గ పాత్రను ఎంచుకోలేదు. ‘బిచ్చగాడు’.. దాని కంటే ముందు తనకు తనకు నప్పే.. విభిన్నమైన పాత్రలతో అతను ఆకట్టుకున్నాడు. కానీ ‘బేతాళుడు’లోనూ అతడి పాత్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. కానీ తర్వాత అతను దారి తప్పుతున్నాడు. ‘కాశి’లో ఒకటికి నాలుగు పాత్రల్లో కనిపిస్తాడు విజయ్. కానీ ఏదీ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా తొలి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రేమికుడి పాత్రలో బాగా ఇరిటేట్ చేస్తాడు. రత్తయ్య పాత్రలో మాత్రం ఓకే అనిపించాడు. హీరోయిన్లలో శిల్పా మంజునాథ్‌ కు ఎక్కువ మార్కులు పడతాయి. తక్కువ సమయంలోనే ఆమె తన నటనతో ఆకట్టుకుంది. తన హావభావాలు బాగున్నాయి. సునైనా పర్వాలేదు. అంజలిది వ్యర్థ పాత్ర. నాజర్.. జయప్రకాష్.. యోగిబాబు.. మధు.. తమ పాత్రల పరిధిలో ఓకే అనిపించారు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

విజయ్ ఆంటోనీ సంగీతం అతడి స్టయిల్లోనే సాగింది. ఐతే పాటలేవీ రిజిస్టర్ కావు. తమిళ టచ్ ఎక్కువగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఓకే. రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం మామూలుగానే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ చూపించారు. భాష్యశ్రీ మాటలైతే ఏమంత ప్రత్యేకంగా లేవు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కృతిగ ఉదయనిధి నిరాశ పరిచింది. మూల కథ వరకు బాగానే ఉన్నా.. కథనం తేలిపోయింది. ఒక సినిమా లాగా కాకుండా సీరియల్ స్టయిల్లో ఆమె సినిమాను నడిపించింది. రచయితగా.. దర్శకురాలిగా కృతిగ నుంచి ఏ మెరుపులూ లేవు.

చివరగా: ఈ 'కాశి' తో చాలా కష్టం.

రేటింగ్- 1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre