Begin typing your search above and press return to search.

కాజ‌ల్ నోట బాహుబ‌లి-3 మాట‌

By:  Tupaki Desk   |   5 Nov 2016 5:30 PM GMT
కాజ‌ల్ నోట బాహుబ‌లి-3 మాట‌
X
ఆలూ లేదు చూలూ లేదు అన్న‌ట్లు మాట్లాడుతోంది కాజ‌ల్ అగ‌ర్వాల్. రాజ‌మౌళి ఇంకా బాహుబ‌లి-2 ప‌నుల్లోనే బిజీగా ఉంటే.. ఆయ‌న వ‌చ్చే ఏడాది ఎప్పుడో చేస్తానంటున్న బాహుబ‌లి-3లో ఛాన్స్ కోసం ఉవ్విళ్లూరుతోంది కాజ‌ల్. ఆ సినిమాలో త‌న‌కు క‌థానాయిక‌గా అవ‌కాశం ద‌క్కాలే కానీ.. అందుకోసం ఇంకే ప్రాజెక్టునైనా తాను త్యాగం చేయ‌డానికి సిద్ధ‌మ‌ని కాజ‌ల్ ప్ర‌క‌టించింది. బాహుబ‌లి తొలి రెండు భాగాల్లో త‌న‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డం గురించి బాధేమీ లేద‌ని.. ఆ సినిమా చూసి తాను గ‌ర్వంగా ఫీల‌య్యాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో కాజ‌ల్ వ్యాఖ్యానించింది.

‘‘బాహుబ‌లి-3లో నాకు ఛాన్స్ ద‌క్కితే అంత కంటే అదృష్టం ఉండ‌దు. రాజ‌మౌళి నా ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్. ఆయ‌న‌తో మ‌గ‌ధీర చేశాను. బాహుబ‌లి-3 ఆఫ‌ర్ చేస్తే దానికే నా తొలి ప్రాధాన్యం. దాని కోసం ఏ సినిమా అయినా వ‌దులుకుంటా. బాహుబ‌లి-1 - 2ల్లో నేను లేక‌పోవ‌డం గురించి బాధ‌లేదు. రాజ‌మౌళి గారు త‌న సినిమాకు స‌రిపోయే న‌టీన‌టుల్నే ఎంచుకుంటారు. బాహుబ‌లి చూసి చాలా గ‌ర్వంగా ఫీల‌య్యాను. మ‌న సినిమాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిత్ర‌మిది. ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమా చూస్తున్న భావ‌నే క‌లిగింది. ఐతే ఇలాంటి సినిమాలు మ‌రీ ఖ‌రీదైన‌వి. వాటిని భ‌రించే శ‌క్తి మ‌న ఇండ‌స్ట్రీలకు లేదు. అయినా రాజమౌళి గారు అలాంటి సినిమా తీసి మెప్పించారు. ఆయ‌న గ్రేట్’’ అని కాజ‌ల్ అభిప్రాయ‌ప‌డింది. మ‌రి కాజ‌ల్ కోరుకుంటున్న‌ట్లు రాజమౌళి ఆమెకు బాహుబ‌లి-3లో అవ‌కాశం క‌ల్పిస్తాడా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/