Begin typing your search above and press return to search.

నాలో ధైర్యం నింపింది .. ఊపిరిపోసింది తారక్ మాటనే!

By:  Tupaki Desk   |   28 July 2022 1:30 AM GMT
నాలో ధైర్యం నింపింది .. ఊపిరిపోసింది తారక్ మాటనే!
X
కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాతో చారిత్రక నేపథ్యం కలిగిన కథను భుజాలకెత్తుకున్నాడు. దానికి కాస్త సైన్స్ ఫిక్షన్ ను జోడించి ముందుకు తీసుకుని వెళ్లాడు. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "అందరూ కూడా కొత్త దర్శకుడిని నమ్మి ఇంతపెద్ద ప్రాజెక్టు ఎలా చేతిలో పెట్టావని అడుగుతున్నారు. అలా అనుకుంటే 'అతనొక్కడే' సినిమా అప్పటికి సురేందర్ రెడ్డి కొత్తనే కదా.

వశిష్ఠ చెప్పిన కథ తెరపై వర్కౌట్ అవుతుందనే నమ్మకం ఉంది. అనిల్ రావిపూడిని నమ్మి 'పటాస్' ..  గుహన్ ను నమ్మి '118' చేస్తే మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే 'బింబిసార' వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ప్రతి ఒక్కరూ ఫాంటసీ సినిమాలను ఇష్టపడతారు .. తెరపై చూస్తూ ఎంజాయ్ చేస్తారు. 'బింబిసార' కథ చెప్పినప్పుడు అందులోని పాయింట్ నాకు బాగా నచ్చింది. 'ఆదిత్య 369' తరువాత ఎవరూ కూడా అలాంటి ఒక పాయింటును టచ్ చేయలేదు.

కొత్తవాడైనప్పటికీ ఒక మంచి కథను రాసి తీసుకొచ్చాడంటే ఆ దర్శకుడి దగ్గర విషయం ఉన్నట్టే. అలాంటి ఒక దర్శకుడికి మంచి టీమ్ ఇవ్వగలిగితే మంచి అవుట్ పుట్ ను తీసుకుని రాగలడనే నమ్మకం నాకు ఉంది.

దర్శకుడిని కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు .. నిర్మాణపరమైన బాధ్యతలనే నేను మరొకరికి అప్పగించాను. ఇప్పుడు నేను పూర్తిగా నటనపైనే దృష్టి పెడుతున్నాను. పాండమిక్ వలన దక్కిన సమయం ఈ సినిమా కథపై కసరత్తు చేయడానికి ఉపయోగపడింది. ఆ సమయంలో అంతా సెట్ చేసుకోవడం వలన బడ్జెట్ తగ్గింది.

ఈ సినిమాలో నేను  రాజుగా చేయాలనేసరికి ఆలోచన చేశాను. ఈ జనరేషన్ కి 'రాజు' అంటే ప్రభాస్ నే గుర్తుకువస్తాడు .. అలాంటి ఒక బలమైన ముద్రను ఆయన వేసేశాడు. అలాంటి ఒక పాత్రను నేను చేయుటం రిస్క్ అవుతుందా? అని అనుకున్నాను.

రాజుగా నా లుక్ .. కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలనే దానిపై రెండు నెలల పాటు కసరత్తు జరిగింది. రాజుగా నా  లుక్ ను నేను ముందుగా చూపించింది కూడా తారక్ కే.  'బాగున్నావన్నయ్యా ..  సెట్టయ్యావు ..  సూపర్బ్' అన్నాడు. ఎప్పుడైతే తారక్ అలా అన్నాడో అప్పుడు నాకు నమ్మకం కలిగింది" అని చెప్పుకొచ్చాడు.