Begin typing your search above and press return to search.

తమ్ముడికి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ

By:  Tupaki Desk   |   11 Sept 2017 12:55 PM IST
తమ్ముడికి నేషనల్ అవార్డ్ గ్యారెంటీ
X
గత రాత్రి జరిగిన 'జై లవ కుశ' ఆడియో రిలీజ్ ఈవెంట్లో.. సినిమాకు నిర్మాత మరియు హీరో ఎన్టీఆర్ కు అన్న అయిన నందమూరి కళ్యాణ్ రామ్.. సినిమా గురించి అలాగే తన తమ్మడు గురించి కాస్త భారీగానే చెప్పాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనబరచిన నటన.. మరే నటుడూ చూపించలేరని.. పెద్ద ఎన్టీఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేనని.. ఆకాశానికి ఎత్తేశాడు.

''అసలు మేం ఏం కథ చేస్తే అంచనాలకు మించి ఉంటుందా అని ఆలోచిస్తున్నప్పుడ.. బాబీ నాకు చెప్పిన 10 నిమిషాల కథతో అద్భుతం అని ఫీలయ్యా. దర్శకుడు బాబీ జై లవ కుశ కథను.. నాకు టైటిల్ తో సహా చెప్పాడు. టైటిల్ కూడా అతను పెట్టిందే. ఈ సినిమా కథ వింటుంటే.. నాకు తాత గారి దాన వీర శూర కర్ణ సినిమా గుర్తొచ్చింది. అలాగే ఈ సినిమాను అచ్చం తాతగారి తరహాలో నువ్వొక్కడివే చేయగలవ్ అని తమ్ముడికి చెప్పినా కూడా.. తను మాత్రం వారం తీసుకుని.. రావణాసురుడి క్యారక్టర్ ను ఎలా చేయాలో ఆలోచించుకుని.. అప్పుడు ఓకె చేశాడు'' అని చెప్పాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కష్టపడినట్లుగా ఎవరూ పడరని.. అన్నేసి కాస్టూమ్ చేంజులు.. అలా రోజుకు మూడు రకాల పాత్రల్లో నిమగ్నమవ్వడం అందరికీ సాధ్యపడదని కొనియాడాడు కళ్యాణ్‌ రామ్.

ఒక రోజు నిద్రలోనే లేచి జై లవకుశలోని డైలాగులు మననం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లి కిటీకి తెరిచి అంచు వరకు వెళ్లిపోయాడని.. కిటీకి అద్దం పగిలి కాలికి గాజు పెంకు గుచ్చుకున్నా చలనం లేనంతగా అందులోనే లీనమయ్యాడని చెప్పుకొచ్చాడు. ఈ సంఘటన తెల్లవారు జామున మూడు గంటలకు జరిగిందని అన్నాడు. తన మరదలు ప్రణతి.. అదేనండి ఎన్టీఆర్ భార్య మరుసటి రోజు తనకు ఫోన్ చేసిందని, బావ ఈయనకు ఏమైందని అడిగి.. ఇదంతా చెప్పిందని తెలిపాడు. తారక్ ఒక కథను ఇష్టపడితే ఎంతగా లీనమవతాడో తెలుసుకోవడానికి ఈ ఒక్క సంఘటన చాలని చెప్పాడు.

వారం రోజులు విశ్రాంతి తీసుకో తర్వాత షూటింగ్ చేద్దామని తారక్ కు చెప్పానని అయినా తన వినలేదని.. 'అన్నా మనం సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పామని కాబట్టి నేను షూటింగ్ కు వస్తా' అన్నాడంట. తారక్ తప్ప ఈ సినిమాను ఎవరూ చేయలేరని తాను చాలెంజ్ చేయగలనని తమ్ముడి సామర్థ్యంపై విపరీతమైన నమ్మకాన్ని చాటాడు.

''జనతా గ్యారేజ్ సినిమాతో ఆల్రెడీ చాలా అవార్డులు కొట్టేశాడు. నాకు తెలిసి.. ఈ సినిమాతో.. నేషనల్ అవార్డు వస్తుంది అని నమ్మకం. తమ్ముడుకి నేషనల్ అవార్డు వచ్చాక మనం ఇంకో పార్టీ చేసుకుందాం'' అంటూ కళ్యాణ్‌ చెప్పడంతో.. ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. సినిమా రిలీజయ్యాక మరి ఏ అవార్డు వస్తుందనే విషయంపై క్లారిటీ వస్తుందిలే.