Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘ఎమ్మెల్యే’

By:  Tupaki Desk   |   23 March 2018 11:35 AM GMT
మూవీ రివ్యూ: ‘ఎమ్మెల్యే’
X
చిత్రం: ‘ఎమ్మెల్యే’

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ - కాజల్ అగర్వాల్ - రవికిషన్ - బ్రహ్మానందం - వెన్నెల కిషోర్ - అజయ్ - పృథ్వీ - మనాలి రాథోడ్ -ప్రభాస్ శీను - లాస్య తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
నిర్మాతలు: భరత్ చౌదరి - కిరణ్ రెడ్డి
రచన - దర్శకత్వం: ఉపేంద్ర మాధవ్

కెరీర్ ఆరంభం నుంచి పడుతూ లేస్తూ సాగుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. చాలా కాలం తర్వాత ‘పటాస్’తో హిట్ కొట్టిన అతను.. ఆ తర్వాత ‘షేర్’.. ‘ఇజం’ సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇప్పుడతను కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ తో చేసిన సినిమా ‘ఎమ్మెల్యే’. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మేరకు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) చదువు పూర్తి చేసి ఖాళీగా ఉన్న అబ్బాయి. తన చెల్లెలు ప్రేమించినవాడికిచ్చి పెళ్లి చేసి వాళ్లింట్లోనే ఉంటూ తనను చూసుకుంటూ ఉంటాడు. అతడికి ఇందు (కాజల్ అగర్వాల్) అనుకోకుండా పరిచయమవుతుంది. ఆమెను కళ్యాణ్ ప్రేమిస్తాడు. కళ్యాణ్ ఉద్యోగంలో చేరిన కంపెనీ ఛైర్మన్ కూతురే ఇందు అని అతడికి తర్వాత తెలుస్తుంది. ఆమె సమస్యలు తీర్చి నెమ్మదిగా తనకు చేరువవుతాడు కళ్యాణ్. కానీ అతడంటే ఇష్టమున్నా పెళ్లి చేసుకోలేనని తేల్చేస్తుంది ఇందు. అప్పుడే ఇందు గురించి కొన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయి. ఆ నిజాలేంటి.. ఆమె కళ్యాణ్ ను పెళ్లి చేసుకోలేననడానికి కారణాలేంటి.. తన మనసు గెలిచేందుకు కళ్యాణ్ ఏం చేశాడు..? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఎమ్మెల్యే’ ప్రోమోలు చూస్తే ఇదొక సగటు కమర్షియల్ లక్షణాలున్న సినిమా అన్న సంగతి అర్థమైపోతుంది. సినిమా చూస్తున్నపుడు అంచనాలేమీ తప్పవు. మంచి బిల్డప్ తో హీరో పరిచయం.. ఆ తర్వాత హీరోయిన్ ఆగమనం.. హీరో తన వెంట పడుతుంటే ఆమె చీదరించుకోవడం.. ఆ తర్వాత హీరో తనకు సాయం చేసినపుడు అతడి మంచి లక్షణాలు చూసి ఇంప్రెస్ కావడం.. ఈలోపు ఒక ఇంటర్వెల్ దగ్గర ఒక మలుపు.. అక్కడి నుంచి కథ మరో చోటికి షిఫ్టయి హీరోకు ఒక ఛాలెంజ్ ఎదురవడం.. అతను హీరోయిన్ని దక్కించుకోవడం కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం.. ఇలా మొత్తం సినిమా అంతా ఒక ఫార్మాట్ ప్రకారం సాగిపోతూ పదుల సంఖ్యలో సినిమాల్ని తలపిస్తుంది.

కొంత కామెడీ.. ఇంకొంత రొమాన్స్.. ఇంకా యాక్షన్.. ఎమోషనల్ సీన్స్.. ఇలా పక్కాగా కమర్షియల్ మీటర్ ఫాలో అయిపోయాడు కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్. ఐతే కళ్యాణ్ రామ్ ఇంతకుముందు చేసిన ‘పటాస్’ కూడా కమర్షియల్ మీటర్ ను ఫాలో అయిన సినిమానే. కానీ అందులో ఆద్యంతం వినోదం ప్రేక్షకుల్ని ముంచెత్తుతూ ఉంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదని కాదు కానీ.. డోస్ సరిపోలేదు. ప్రధమార్ధం వరకు బాగానే టైంసాప్ చేయించే ఈ సినిమా.. ద్వితీయార్ధంలో నత్తనడకన సాగుతుంది. ఒక దశ తర్వాత కథాకథనాలు మరీ ప్రెడిక్టబుల్ గా తయారవడంతో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఆశ్చర్యపోయే ప్రేక్షకుడు.. ఆ తర్వాత అసలు కథ తెలిశాక నిట్టూరుస్తాడు. క్లైమాక్స్ వరకు మొత్తం కథంతా కళ్ల ముందు కనబడుతుంటే.. దానికి భిన్నంగా ఏమైనా జరుగుతుందేమో అని చూస్తాడు. కానీ ఆ ఆశలేమీ నెరవేరవు.

కానీ ఒక నియోజకవర్గానికి కొత్త అయిన వ్యక్తి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి.. అతడి ఇమేజ్ ను దెబ్బ తీసి.. అక్కడి జనాల్ని ఇంప్రెస్ చేసి తాను ఎమ్మెల్యే అయిపోవడం అన్నది తెలుగు సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారం. ఇలా మన హీరోలు తరతరాలుగా ‘జనాల మనసుల్ని గెలుస్తూనే’ ఉన్నారు. ఆ క్రమం ఎలా ఉంటుందో చిన్న పిల్లాడినడిగినా చెప్పేస్తాడు. ఇందులో ఇక ఆసక్తి ఏముంటుంది? ‘శ్రీమంతుడు’ స్టయిల్లో ‘ఎమ్మెల్యే’లోనూ కొన్ని మంచి విషయాలు చెప్పే ప్రయత్నం జరిగింది కానీ.. ‘శ్రీమంతుడు’లో ఉన్న సిన్సియారిటీ ఇక్కడ లేదనే చెప్పాలి. ఆ మంచి విషయాల్ని కూడా కమర్షియల్ మీటర్లోనే చెప్పే ప్రయత్నం జరగడం వల్ల.. ఎమోషన్ అనుకున్న స్థాయిలో పండలేదు.

‘ఎమ్మెల్యే’ ప్రథమార్ధం వరకు పెద్దగా సమయం తెలియకుండానే సాగిపోతుంది. ఆరంభంలో మామూలుగానే అనిపించినప్పటికీ.. ఆ తర్వాత పోసాని.. వెన్నెల కిషోర్ అందుకుని నవ్విస్తూ టైంపాస్ చేయిస్తారు. ఆ తర్వాత ‘దూకుడు’ సినిమాను తలపించే డ్రామా ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సినిమాకు అది ఆకర్షణ అని చెప్పొచ్చు. బ్రహ్మానందం చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో నవ్వించాడు ఈ ఎపిసోడ్లో. ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకుంటుంది కానీ.. ద్వితీయార్దం నుంచే ‘ఎమ్మెల్యే’ చాలా రొటీన్ గా కనిపిస్తాడు. ఒక ఫార్మాట్లో సాగిపోయే కమర్షియల్ సినిమాల్ని ఎంజాయ్ చేయగలిగే వాళ్లకు ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది కానీ.. కొత్తదనం కోరుకునే వాళ్లకు మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు:

నందమూరి కళ్యాణ్ రామ్ తనకు సూటయ్యే పాత్రను ఎంచుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే కొంచెం యూత్ ఫుల్ గా కనిపించాడు. క్యారెక్టర్ కొత్తేమీ కాదు కానీ.. అతడి బాడీ లాంగ్వేజ్.. లుక్ మునుపటితో పోలిస్తే కొంచెం కొత్తగా అనిపిస్తాయి. యాక్షన్.. ఎమోషనల్ సీన్లలో బాగా చేశాడు. కొంత వరకు కామెడీతోనూ మెప్పించాడు. కాజల్ అగర్వాల్ నటన పరంగా జస్ట్ ఓకే అనిపిస్తుంది. గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. ఆమెకు చాలా చోట్ల మేకప్ ఎక్కువైంది. విలన్ రవికిషన్ పాత్ర మామూలే. ‘రేసుగుర్రం’లో మద్దాలి శివారెడ్డి పాత్రకు కొనసాగింపులా అనిపిస్తుందిది. పోసాని కృష్ణమురళి.. బ్రహ్మానందం.. పృథ్వీ.. వెన్నెల కిషోర్ తమ తమ పరిధుల్లో బాగానే నవ్వించారు. అజయ్.. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతికవర్గం:

మణిశర్మ సంగీతంలో కొత్తదనం ఏమీ కనిపించదు. యుద్ధం యుద్ధం.. అంటూ సాగే పాట మినహాయిస్తే మిగతావన్నీ చాలా మామూలుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా రొటీన్ గా ఈ తరహా కమర్షియల్ సినిమాలకు తగ్గట్లుగా ఉంది. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం ఓకే. అది సినిమాకు కొంచెం రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఉపేంద్ర మాధవ్.. కొత్త దర్శకుడి నుంచి ఆశించే అంశాలు చూపించలేదు. చాలా మామూలు కథను కమర్షియల్ గా డీల్ చేశాడు. అతను ప్రథమార్ధంలో తన గురువు శ్రీను వైట్ల ఫార్ములాను ఫాలో అయిపోయాడు. ద్వితీయార్ధంలో కాస్తయినా కొత్తదనం కోసం ప్రయత్నించి ఉండాల్సింది.

చివరగా: ఎమ్మెల్యే.. మామూలు లక్షణాలున్న అబ్బాయే

రేటింగ్- 2.25/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre