Begin typing your search above and press return to search.

118 కథకు స్ఫూర్తి అవేనా?

By:  Tupaki Desk   |   1 March 2019 5:01 PM GMT
118 కథకు స్ఫూర్తి అవేనా?
X
కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 118 మిశ్రమ స్పందన మధ్య మొదటి రోజు పూర్తి చేసుకుంది. వసూళ్లు ఓపెనింగ్ షేర్ మొదలైన లెక్కలు తేలడానికి కొంత టైం పడుతుంది కానీ వినూత్నమైన పాయింట్ తో దర్శకుడు కెవి గుహన్ తెరకెక్కించిన తీరు థ్రిల్లర్ లవర్స్ ని కొంత మేర సంతృప్తిపరిచినా సాధారణ ప్రేక్షకులను మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే రిపోర్ట్స్ వస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే హీరో కళ్ళకు రిటైనింగ్ పవర్ వచ్చి ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోవడం అనే లైన్ లో వైవిధ్యం ఉన్నా ఇది గతంలో వచ్చిన ఓ సినిమా స్ఫూర్తిగా అనిపించడం అసహజం కాదు.

1991లో నరేష్-శోభన జంటగా కోకిల అనే మూవీ వచ్చింది. అందులో నరేష్ కు కళ్ళు పోయి వేరే వాళ్ళవి అమరిస్తే తనకు పరిచయమే లేని ఓ స్వామీజీ హత్యను చూసినట్టు భయపడతాయి. సస్పెన్స్ అలా కొనసాగుతూ విలన్ ఎవరో షాకింగ్ ట్విస్ట్ తో తెలుస్తుంది. 118లో కళ్యాణ్ రామ్ కు కళ్ళు పోవు కానీ ఎవరో నివేదాను హత్య చేయటం కలలో వస్తూ ఉంటుంది.

అంతే కాదు. మరో సినిమాకు సైతం కనెక్షన్ ఉంది. అది 1988లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన చెట్టు కింద ప్లీడర్. అందులో శరత్ బాబుని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. అది పరిశోధించడానికి పూనుకుంటాడు హీరో. ఎక్కడికి వెళ్లినా సాక్ష్యాలు అందినట్టే అంది చేజారిపోతుంటాయి. కేసు ఇంకా క్లిష్టంగా మారుతుంది. చిక్కుముడులు వీడుతూ చివరికి ఊహించని మలుపుతో కథ ముగుస్తుంది. 118లో ఈ రెండు కథల ఛాయలూ కనిపిస్తాయి.

కళ్ళ కాన్సెప్ట్ కోకిలది కాగా ఇన్వెస్టిగేషన్ లైన్ చెట్టు కింద ప్లీడర్ ది. ఏదైతేనేం మొత్తానికి ఎలా మిక్స్ చేసుకున్నా గుహన్ ఓ గొప్ప థ్రిల్లర్ ని ఇవ్వడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయారని చెప్పొచ్చు. మరో రెండు మూడు రోజుల్లో బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ వచ్చాక ఇంకాస్త క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు ఓ కంక్లూజన్ కి రావొచ్చు. రొటీన్ కి భిన్నంగా కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగం కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తేలాలంటే వసూళ్ల లెక్కలు కూడా చూడాలి. లెట్ వెయిట్ అండ్ సీ.