Begin typing your search above and press return to search.

బాలయ్య దూరం పెట్టిన మాట వాస్తవం

By:  Tupaki Desk   |   10 Jun 2018 2:30 PM GMT
బాలయ్య దూరం పెట్టిన మాట వాస్తవం
X
ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ.. నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత ఆప్యాయంగా ఉండేవారో తెలిసిందే. ఏదైనా సందర్భం వచ్చి మీడియాతో మాట్లాడినపుడల్లా బాబాయి గురించి మాట్లాడకుండా ఆగేవాడు కాదు కళ్యాణ్ రామ్. అతడిని బాలయ్య కూడా అలాగే ఆదరించేవాడు. అప్పట్లో తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌ తో కళ్యాణ్ రామ్‌ కు అంత సాన్నిహిత్యం ఉండేది కాదు. వాళ్లిద్దరూ కలవడమే అరుదు. తాము తరచుగా ఏమీ కలవమని ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టేశాడు కూడా కళ్యాణ్ రామ్. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. హరికృష్ణకు తెలుగుదేశం పార్టీతో బంధాన్ని పూర్తిగా తెంచేసి ఆయన్ని పక్కన పెట్టేశాక ఆయన ఆలోచనలు మారినట్లున్నాయి. బాలయ్యకు ఆయనకు దూరం పెరిగింది.

ఈ నేపథ్యంలో మనం మనం కలిసుందా అనే భావన తన ఇద్దరు కొడుకుల్లో రేకెత్తించారో ఏమో తెలియదు కానీ.. కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ మధ్య ఎన్నడూ చూడని అనుబంధం మొదలైంది. ఇద్దరూ సొంత అన్నదమ్ముల్లా ఆత్మీయులుగా మారిపోయారు. వారి బంధం ఎలా సాగుతోందో గత రెండేళ్లుగా చూస్తున్నాం. ఎన్టీఆర్‌ ను కళ్యాణ్ రామ్ దగ్గరికి తీసుకోవడం నచ్చకో ఏమో.. బాలయ్య అతడిని దూరం పెట్టేశాడు. అతడికి బాలయ్యకు దూరం బాగా పెరిగందని తాజాగా కళ్యాణ్ రామ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను బట్టి స్పష్టమవుతోంది. ఈ రోజు బాలయ్య పుట్టిన రోజు. కానీ బాబాయి గురించి ఎక్కడా ఒక్క మాటా ఎత్తకుండా జాగ్రత్త పడ్డాడు కళ్యాణ్ రామ్. అలాగని టాపిక్ ఏదీ రాలేదని అనుకోవడానికి లేదు. నిన్నటితరం స్టార్ హీరోల్లో తనకు నచ్చిన లక్షణాల గురించి చెబుతూ చిరంజీవి.. నాగార్జున.. వెంకటేష్ ల గురించి ప్రస్తావించి బాలయ్యను విస్మరించాడు కళ్యాణ్ రామ్. బాలయ్య గురించి కొత్తగా చెప్పేదేముందిలే అని ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా.. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ లో నటించడం గురించి అడిగినపుడు కూడా బాలయ్య పేరెత్తకుండా నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశాడు కళ్యాణ్ రామ్. తేజ దర్శకుడిగా ఉన్నపుడు తనను ఓ పాత్ర కోసం అడిగాడన్నాడే తప్ప.. బాలయ్య నుంచి ఏమైనా సమాచారం ఉందా అన్నది చెప్పలేదు. ఇప్పుడంతా మారిపోయింది కదా.. ఆ సినిమాకు సంబంధించి ఏం జరుగుతోందో నాకేమీ తెలియదు.. అంటూ మాట దాటవేశాడు. దీన్ని బట్టి చూస్తే బాలయ్యకు.. కళ్యాణ్ రామ్‌ కు మధ్య అంతరం బాగానే పెరిగినట్లు తెలుస్తోంది.