Begin typing your search above and press return to search.

తప్పు అభిమానులదేనా కళ్యాణ్ సార్?

By:  Tupaki Desk   |   11 Oct 2015 5:30 PM GMT
తప్పు అభిమానులదేనా కళ్యాణ్ సార్?
X
నిన్న ‘షేర్’ ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ అన్నట్లు కళ్యాణ్ రామ్ ‘జెన్యూన్’ పర్సన్. హిపోక్రసీలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ పరిశ్రమలో నిజాయితీగా మాట్లాడుతూ.. భేషజాలు లేకుండా ప్రవర్తించే అతి కొద్ది మందిలో కళ్యాణ్ రామ్ ఒకడు. అందుకే నటుడిగా, నిర్మాతగా కంటే కూడా కళ్యాణ్ రామ్ ను వ్యక్తిగానే ఎక్కువమంది అభిమానిస్తారు. ఏదైనా సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడే కళ్యాణ్ రామ్.. ‘షేర్’ ఆడియో ఫంక్షన్ లో తమ నందమూరి అభిమానుల తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ ఫ్యామిలీ హీరోల్ని వేరు చేసి చూడొద్దని.. తామందరం ఒక్కటే ఫ్యామిలీ అని.. తమను వేరు చేసి మాట్లాడొద్దని అభిమానులకు వార్నింగ్ లాంటి రిక్వెస్ట్ చేశాడు.

ముసుగులో గుద్దులాట లేకుండా అభిమానుల్లో వర్గాల గురించి.. విభేదాల గురించి కళ్యాణ్ రామ్ మాట్లాడ్డం బాగానే ఉంది కానీ.. ఈ వర్గాలు, విభేదాలకు కారణం ఎక్కడుందని కూడా ఆలోచించాల్సిన అవసరముంది. నిజానికి విభేదాలు ముందు మొదలైంది అభిమానుల్లో కాదు.. నందమూరి హీరోల్లో. ఇంతకుముందు చాలా సన్నిహితంగా ఉన్న బాలయ్య - ఎన్టీఆర్ ఎందుకు ఇప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవట్లేదో మరి. ఒకరి ఫంక్షన్ లకు ఒకరెందుకు రావట్లేదో? ఇంతకుముందు తన మాటల్లో, సినిమాల్లో బాలయ్య ప్రస్తావన తెస్తూ బాబాయిని ఆకాశానికెత్తేసే ఎన్టీఆర్ ఇప్పుడెందుకు ఆ పని చేయట్లేదో? ఇంతకుముందులా ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ ల ఫంక్షన్ లకు బాలయ్య ఎందుకు రావట్లేదో? ‘బాద్ షా’ సినిమా విడుదల సమయంలో దానికి వ్యతిరేకంగా పైనుంచి నందమూరి అభిమానులకు ఎందుకు సందేశాలు వెళ్లాయో?.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికితే తప్పు ఎక్కడున్నది కూడా తెలిసిపోతుంది.

నిజానికి హీరోల మధ్య తేడాలున్నా అభిమానులు మాత్రం సాధ్యమైనంతవరకు ఒక్కటిగానే ఉన్నారు. బాలయ్య సినిమా విడుదలైనా, ఎన్టీఆర్ సినిమా విడుదలైనా.. ఉమ్మడిగానే కదులుతున్నారు. ఆ సినిమాల్ని మోస్తున్నారు. కాబట్టి అభిమానులదే తప్పని అనేయడానికి లేదు. అభిమానుల ముందు ఓపెన్ అయినట్లే.. తమ ఫ్యామిలీ హీరోలందరినీ కలుపుకుని మనసు విప్పి మాట్లాడుకుంటే నందమూరి బలం రెట్టింపవడం ఖాయం.