Begin typing your search above and press return to search.

ఓ మంచి పాట ఎప్పటికీ వృధా కాదు

By:  Tupaki Desk   |   28 July 2015 6:02 PM GMT
ఓ మంచి పాట ఎప్పటికీ వృధా కాదు
X
ఏ.ఆర్‌.రెహమాన్‌ అంతటి వాడినే ప్రారంభంలో సుభాష్‌ ఘాయ్‌ తిరస్కరించారు. అయినంత మాత్రాన అతడు ఆస్కార్‌ అందుకోలేదా? అని ప్రశ్నిస్తున్నారు కళ్యాణ్‌ కోడూరి. ఎం.ఎం.కీరవాణి సోదరుడిగా సినీపరిశ్రమకి వచ్చినా లక్కు అతడికి ఎప్పుడూ ఫేవర్‌ చేయలేదు. ఐతే వంటి సూపర్‌ హిట్‌ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించి 12ఏళ్లలో 13 సినిమాలకు సంగీతం అందించాడు.

అందులోనూ కేవలం చిన్న సినిమాలే ఎక్కువ. ఇప్పుడు అదే చిన్న సినిమా అతడికి అవార్డుల పంట పండించింది. కమెడియన్‌ అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంలోని 'ఏం సందేహం లేదు' పాటకి ఏకంగా 7 అవార్డులు రావడం విశేషం. ఇటీవలే జరిగిన మిర్చి మ్యూజిక్‌ అవార్డు వేడుకల్లో వీటని ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్‌ కోడూరి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

ఓ మంచి పాట ఎప్పటికీ వృధా కాదు. సందర్భం వచ్చినప్పుడు గుర్తింపు దక్కుతుంది. వాస్తవానికి ఈ పాటను కృష్ణవంశీ దర్శకత్వంలోని మొగుడు కోసం సిద్ధం చేసుకున్నా. కానీ కృష్ణవంశీ వద్దనుకున్నారు. ఆ తర్వాత క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నా. సింపుల్‌ పదాలతో అనంత శ్రీరామ్‌ రాసిన ఈ పాట ఎప్పటికైనా మంచి పాట అవుతుందన్న నమ్మకం నాకుంది. ఆ పాటలోని విషయాన్ని గ్రహించిన అవసరాల తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఇదిగో ఇప్పుడిలా అవార్డులే అవార్డులు. మంచి పాటదే గెలుపు అని రుజువైంది... మహేష్‌ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కోడూరి.