Begin typing your search above and press return to search.

'హలో' పిల్ల ఏమైపోయిందబ్బా?

By:  Tupaki Desk   |   10 Jan 2021 9:51 AM GMT
హలో పిల్ల ఏమైపోయిందబ్బా?
X
అఖిల్ హీరోగా ఆ మధ్య వచ్చిన 'హలో' సినిమాతో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ .. నిన్నటి తరం అందాల తార 'లిజీ' కూతురే ఈ అమ్మాయి. సినిమా నేపథ్యంతో కూడిన కుటుంబం నుంచి రావడం వలన, ఈ అమ్మాయి తెలుగులో కుదురుకుంటుందనే అంతా అనుకున్నారు. ఆ తరువాత ఈ అమ్మాయి సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 'చిత్రలహరి'లోను .. శర్వానంద్ 'రణరంగం' మూవీలోను కనిపించింది. ఇక నిదానంగా జోరు పెంచుతుందని అంతా అనుకుంటూ ఉండగా, చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది.

విక్రమ్ కుమార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మాయి, ఇక్కడే అవకాశాల కోసం గట్టిగా ట్రై చేయవలసింది. కానీ చిన్నపాటి గ్యాప్ రాగానే ఈ అమ్మాయి తమిళ .. మలయాళ సినిమాల దిశగా ఫోకస్ పెట్టింది. ఈ కొద్ది గ్యాప్ లోనే తెలుగులోకి కొత్త హీరోయిన్లు చాలామంది అడుగుపెట్టారు. కొంతమంది ఎడా పెడా సినిమాలు చేసేసుకుంటూ వెళ్లిపోతున్నారు కూడా. కొత్త హీరోయిన్లు స్క్రీన్ పై కొత్త అందాలు చూపిస్తుంటే, ఏ ప్రేక్షకుడు కూడా అంతకుముందున్న హీరోయిన్ గురించి ఆలోచించడు. అలాగే కల్యాణి ప్రియదర్శన్ ని దాదాపు మరిచిపోయారు.

తెలుగు తెరకి పూర్తిగా దూరమైపోయిన ఈ అమ్మాయి, టైమ్ వేస్ట్ చేయలేదనే తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలు .. రెండు మలయాళ సినిమాలు ఉన్నాయి. తమిళంలో శింబూ సరసన చేస్తున్న 'మానాడు' సినిమాపైనా, దుల్కర్ సల్మాన్ జోడీగా చేస్తున్న 'వాన్' సినిమాపైన ఆమె భారీగానే ఆశలు పెట్టుకుంది. కొత్త ఏడాదిలో ఈ రెండు సినిమాలు థియేటర్స్ కి రానున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు, కోలీవుడ్ లో తనని నిలబెడతాయనే బలమైన నమ్మకంతో ఉంది. ఆమె నమ్మకం ఎంతవరకూ నిజమవుతుందనేది చూడాలి మరి!