Begin typing your search above and press return to search.

'బింబిసార' సీక్వెల్లో ఎన్టీఆర్ చేసే ఛాన్స్ : కల్యాణ్ రామ్

By:  Tupaki Desk   |   5 July 2022 2:47 AM GMT
బింబిసార సీక్వెల్లో ఎన్టీఆర్ చేసే ఛాన్స్ : కల్యాణ్ రామ్
X
హీరోగా .. నిర్మాతగా కల్యాణ్ రామ్ వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. నిర్మాతగా ఆయన లాభాలను అందుకున్న సందర్భాలు తక్కువే అయినా, ధైర్యంతో ముందుకు వెళుతున్నాడు. కథ కొత్తగా అనిపిస్తే చాలు, బడ్జెట్ విషయంలో ఆయన వెనుకాడటం లేదు. కథను నమ్మితే చాలు, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి కూడా ఆయన ఆలోచన చేయడం లేదు. కొత్తగా ఏదైనా చేయాలనే ఒక ఉత్సాహాన్ని మాత్రం వదులుకోకుండా ముందుకు వెళుతున్నాడు. అలా ఆయన హీరోగా .. ఆయన నిర్మాణంలో రూపొందిన విభిన్నమైన కథా చిత్రమే 'బింబిసార'.

ఈ సారి ఆయన ఈ సినిమాలో చరిత్రతో పాటు సైన్స్ ను కూడా టచ్ చేస్తున్నాడు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఆయన ఈ సినిమాను సిద్ధం చేశాడు. నిన్న ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కథ 'బింబిసార' కాలంలోనూ .. ప్రస్తుతంలోను జరుగుతుందనే విషయాన్ని చెప్పేశారు. రెండు డిఫరెంట్ లుక్స్ తో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. కథలో కొత్త పాయింట్ ఉందని .. సీక్వెల్స్ కి అవకాశం ఉందనే విషయం అర్థమవుతూనే ఉంది. సీక్వెల్ లో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని కల్యాణ్ రామ్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "ఈ కథను విన్న తరువాత ఎన్టీఆర్ తో నేను ఏ విషయాలను గురించి చర్చించాను అనే సంగతులను నేను మరో ఈవెంట్ లో చెబుతాను. తాను సీక్వెల్ లో చేస్తాడని నేను ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది.

సీక్వెల్ లో ఆయన చేసే అవకాశం ఉందని మాత్రం చెప్పగలను. వశిష్ఠ నాకు చాలా కథలు చెప్పాడు .. కానీ నాకు ఈ కథ చాలా బాగా నచ్చింది. మొదటి నుంచి కూడా నాకు సోషియో ఫాంటసీ సినిమాలంటే ఇష్టం. అందువల్లనే బడ్జెట్ విషయంలో ఎలాంటి ఆలోచనలు చేయలేదు.

టైమ్ ట్రావెల్ అనేది ఈ సినిమాలో ఒక ఎలిమెంట్ గా మాత్రమే కనిపిస్తుంది. తాతగారు చేసిన 'పాతాళభైరవి' .. 'జగదేకవీరుడు' కథల స్ఫూరితో ఈ సినిమా చేయడం జరిగింది. 'అవెంజర్స్' వంటి సినిమాలను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అంతా ఇప్పుడు ఎక్కువగా లైక్ చేస్తున్నారు.

అలాంటి ఒక కంటెంట్ తో రావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాము. ఈ కథను నాలుగు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని భావిస్తున్నాము. సెకండ్ పార్టు షూటింగును త్వరలో మొదలుపెట్టి, 2023 ఆగస్టులో రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.