Begin typing your search above and press return to search.

ఇది మామూలు కసరత్తు కాదు కల్యాణ్ రామ్!

By:  Tupaki Desk   |   28 July 2022 10:30 AM GMT
ఇది మామూలు కసరత్తు కాదు కల్యాణ్ రామ్!
X
కల్యాణ్ రామ్ చాలాకాలం క్రితమే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తనని తాను హీరోగా నిరూపించుకోవాలనే పట్టుదలతో నిర్మాతగా కూడా మారాడు. విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వెళ్లాడు. ఈ ప్రయత్నంలో ఎక్కువసార్లు తాను ఆశించిన ఫలితం దక్కకపోయినా ఆయన నిరాశపడలేదు. తనకి తెలిసింది సినిమా మాత్రమే అని చెప్పే కల్యాణ్ రామ్, దానిపైనే మరింత పట్టుబిగిస్తూ వెళ్లాడు. అలా ఆయన వైవిధ్యభరితమైన సినిమాలను థియేటర్లకు తీసుకుని వచ్చాడు.

కల్యాణ్ రామ్ తన కెరియర్లో లుక్ విషయంలో డిఫరెంట్ గా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కథకి అవసరం అనుకుంటే పాత్రకి తగినట్టుగా మారడానికి ఆయన ఎంత మాత్రం తగ్గడనే విషయాన్ని కూడా నిరూపించాడు. లుక్ పరంగా ఆయన పూర్తిస్థాయిలో కొత్తగా కనిపించిన సినిమాగా 'బింబిసార' కనిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన 'బింబిసార'గా కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం కల్యాణ్ రామ్ 13 కేజీల బరువు తగ్గినట్టుగా చెప్పాడు.

'ఎంతమంచివాడవురా' సినిమా చేసే సమయానికి తాను 88 కేజీలకు పెరిగిపోయాననీ, అయితే ఈ పాత్రకి తగినట్టుగా తాను బరువు తగ్గాలని దర్శకుడు చెప్పాడని అన్నాడు. ఒక రాజు మంచి ఫిట్ నెస్ తో కనిపించాలి .. ఆ పాత్రను అలా చూడటానికే జనం ఇష్టపడతారు.

అందువలన జిమ్ లో అదేపనిగా కసరత్తు చేసి బరువు తగ్గానని చెప్పాడు. అలా ఈ సినిమా షూటింగు మొదలయ్యే సమయానికి తాను 75 కేజీలకు వచ్చేశానని అన్నాడు. ఆ పాత్రకి తగినట్టుగా తాను మారడం పట్ల తారక్ తో పాటుగా యూనిట్ సభ్యులంతా సంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పాడు.

చాలాకాలంగా ఇలాంటి ఒక సినిమా చేయాలనే తన కోరిక ఈ సినిమాతో నెరవేరిందనీ, మంచి పేరున్న టీమ్ ఈ సినిమా కోసం పనిచేసిందని చెప్పాడు. వాళ్లంతా ఎంత మనసుపెట్టి పనిచేశారనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుందనీ, 'బింబిసార' ఇలా ఉండొచ్చని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు ఎవరూ కూడా నిరాశతో వెనుదిరగరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఈ సినిమా తప్పకుండా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. కల్యాణ్ రామ్ ఈ సినిమా పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా ఆయన నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.