Begin typing your search above and press return to search.

కమల్ కి కోపం వచ్చేసి షూటింగుకి రాను పొమ్మన్నాడట!

By:  Tupaki Desk   |   6 Sep 2022 4:30 PM GMT
కమల్ కి కోపం వచ్చేసి షూటింగుకి రాను పొమ్మన్నాడట!
X
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమాలలో 'సొమ్మొకడిది సోకొకడిది' ఒకటి. కమల్ - జయసుధ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా 1979లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న సింగీతం ఈ సినిమాకి సంబంధించిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "కమల్ హాసన్ గారితో నేను ఏడు సినిమాల వరకూ చేశాను. ఆ సినిమాలలో 'సొమ్మొకడిది సోకొకడిది' ఒకటి. ఆ సినిమా షూటింగు సమయంలో నాపై కమల్ అలిగారు .. నేను షూటింగుకి రాను పొమ్మన్నారు. అందుకు ఒక కారణం ఉంది.

"ఈ సినిమా షూటింగు చెన్నై లోని వీజీపీ దగ్గర బీచ్ లో జరుగుతోంది. కమల్ .. జయసుధ పై ఒక డ్యూయెట్ తీస్తున్నాము. లంచ్ కోసం కమల్ .. జయసుధ వెళ్లారు. 3 గంటలకు కెమెరా ముందుకు వచ్చేయాలి. 4:30 అవుతున్నా కమల్ రావడం లేదు. లైటింగ్ పోతుంది ఎలాగా అని టెన్షన్ తో ప్రొడక్షన్ మేనేజర్ ను అరవడం మొదలెట్టాను. మరో వైపున షూటింగు చూడటానికి వచ్చిన జనం. ఈ లోగా నేను అందరి ముందు కమల్ ను తిడుతున్నాననే సంగతి ఎవరో ఆయనికి చెప్పేశారు. ఆయనికి కోపం వచ్చేసింది. లొకేషన్ కి వచ్చిన ఆయన దూరంగా కుర్చీలో కూర్చున్నారు.

అసిస్టెంట్ వెళ్లి షాట్ రెడీ అని చెబితే 'నాకు చాలా కోపంగా ఉంది .. నేను షూటింగుకి రానని డైరెక్టర్ కి చెప్పండి' అన్నారు. చిన్నపిల్లాడు మాదిరిగా అలిగి కూర్చున్నారు. దాంతో నేను ఆయన దగ్గరికి వెళ్లి 'ఏమైంది సార్' అని అడిగాను. 'మీరు అందరి ముందు నన్ను తిట్టారట ..

అందువలన నాకు కోపం వచ్చింది .. నేను షూటింగ్ చేయను' అన్నారు. 'అలా అని మీకు ఎవరు చెప్పారు సార్ .. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు. ఒక వైపున ఎండపోతోంది .. సూర్యుడు ఎవరి కోసమూ వెయిట్ చేయడు. ఆ టెన్షన్ లో చిరాకుపడ్డాను అంతే .. ఒకవేళ మీరు హర్ట్ అయితే సారీ' అన్నాను.

'అయితే మీరు నన్ను తిట్టలేదా?' అని ఆయన అంటే, ' అలాంటిదేం లేదు సార్' అన్నాను. 'అయితే పదండి' .. అంటూ అక్కడి నుంచి లేచి వస్తూ, అక్కడే ఉన్న జయసుధతో 'ఏంటి జయసుధ .. ఇంత లేటు .. టైమ్ కి రావాలి కదా. ఈ హీరోయిన్లంతా ఎప్పుడూ ఇంతే ..

లేటుగా వస్తారు' అని ఆమెను అంటూ మళ్లీ కెమెరాల ముందుకు వచ్చారు. ఆ సంఘటన తరువాత ఇప్పటివరకూ కూడా ఇద్దరం మంచి స్నేహితులముగానే ఉంటూ వచ్చాము. ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటాము .. సరదాగా నవ్వుకుంటాము" అంటూ చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.