Begin typing your search above and press return to search.

తమిళ ‘బిగ్ బాస్’పై విమర్శల వర్షం

By:  Tupaki Desk   |   27 Jun 2017 7:08 AM GMT
తమిళ ‘బిగ్ బాస్’పై విమర్శల వర్షం
X
హిందీలో విజయవంతమైన ‘బిగ్ బాస్’ షోను తమిళంలోనూ మొదలుపెడుతున్నారనగానే చాలామందిలో ఇది ఏమేరకు విజయవంతం అవుతుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. హిందీ ఛానెళ్లకు వ్యూయర్ షిప్ ఎక్కువ. వాళ్ల అభిరుచి కూడా భిన్నమైంది. హిందీ మాట్లాడే రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాళ్లు కోరుకుంటే బోలెడంత మంది సెలబ్రెటీలు ‘బిగ్ బాస్’ షోలో పార్టిసిపెంట్లుగా పాల్గొనడానికి ముందుకొస్తారు. కానీ కొంచెం ట్రెడిషనల్ గా ఉండే సౌత్ ఇండియాలో ఈ షో కోసం ఎంత మంది సెలబ్రెటీలు వస్తారనే డౌట్ ఉంది. పైగా ‘బిగ్ బాస్’ లాంటి షోలు ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి సరిపోయేవేమో అన్న సందేహాలూ లేకపోలేదు. ఇన్ని డౌట్ల మధ్య కమల్ హాసన్ హోస్ట్ గా విజయ్ టీవీ ‘బిగ్ బాస్’ షోను లాంచ్ చేసింది.

ఐతే తొలి ఎపిసోడే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ షో కోసం ఎంపిక చేసిన పార్టిసిపెంట్ల విషయంలోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. జల్లికట్టు ఉద్యమంలో పాల్గొన్న ఓ అమ్మాయిని ఈ షో కోసం పార్టిసిపెంట్ గా తీసుకున్నారు. ఉద్వేగభరితంగా సాగిన జల్లికట్టు ఉద్యమం నుంచి ఓ అమ్మాయిని ఇలాంటి షోకు తీసుకోవడం ఏంటని ఓవైపు.. ఆ అమ్మాయి సెలబ్రెటీనా అంటూ మరో వైపు వాయింపు మొదలైపోయింది. మరోవైపు ఔట్ డేట్ అయిపోయిన హీరోయిన్ నమితను ఈ షోకు ఎంపిక చేయడం పట్లా వ్యతిరేకత వ్యక్తమైంది. పార్టిసిపెంట్లెవ్వరూ కూడా అంత ఎగ్జైట్మెంట్ కలిగించట్లేదు. కమల్ హాసన్ వ్యాఖ్యానం కూడా ఏమంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మొత్తంగా ఈ షో మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజిలో జరుగుతోంది ప్రస్తుతం.

విజయ్ టీవీ వాళ్లలో ఇది గుబులు రేపుతోంది. ఈ షో మున్ముందు ఎలా నడుస్తుందో.. ఎలా సస్టెయిన్ అవుతుందో అన్న సందేహాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు ‘బిగ్ బాస్’ మీద భారీ పెట్టుబడి పెడుతున్న మా టీవీ వాళ్లలోనూ కంగారు మొదలైంది. ఎన్టీఆర్ వ్యాఖ్యానం ఎంత బావున్నా సరే.. అసలు ప్రోగ్రాం ఏమేరకు ఆసక్తి రేకెత్తిస్తుందన్నదే సందేహంగా మారింది. ఈ ప్రోగ్రాం కోసం చాలామంది సెలబ్రెటీల్ని.. యాంకర్లను సంప్రదించగా ముఖం చాటేసినట్లు వార్తలొస్తున్నాయి. పార్టిసిపెంట్ల విషయంలో ఆకర్షణ లేకపోతే ఇక్కడా విమర్శలు ఎదుర్కోక తప్పదు. మరి ఎన్టీఆర్ అండ్ కో ఏం చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/