Begin typing your search above and press return to search.
‘అమ్మ’ చేసింది తప్పు: కమల్
By: Tupaki Desk | 15 July 2018 6:24 AM GMTమలయాళ ఇండస్ట్రీపై కమల్ హాసన్ మండిపడ్డారు. మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘అమ్మ’లో నటుడు దిలీప్ కు మళ్లీ సభ్యత్వాన్ని ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి సభ్యత్వం ఎలా ఇస్తారని ‘అమ్మ’ను నిలదీశారు. ‘చట్టపరంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి తిరిగి సభ్యత్వం ఇవ్వడం తప్పు. ఒకవేళ దిలీప్ ను క్షమించాలంటే వ్యక్తిగతంగా చేయొచ్చు’ అని కమల్ స్పష్టం చేశారు.
‘ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మొత్తం సభ్యులందరితో చర్చించాలి.. అలా కాకుండా అతనికి సభ్యత్వం ఇచ్చి.. బాధిత నటికి అన్యాయం చేశారు. అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి సభ్యులందరి ఆమోదం అవసరం.. ఆర్టిస్ట్ అసోసియేషన్ సజావుగా సాగాలంటే అందరి సమష్టి నిర్ణయం అవసరం’ అని కమల్ తేల్చిచెప్పారు.
గతేడాది నటి భావన కారులో ప్రయాణిస్తున్నప్పుడు లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటన వెనుకాల మలయాళ నటుడు దిలీప్ హస్తం ఉందని భావన ఆరోపించింది. ఆమె ఫిర్యాదును పరిశీలించి.. పోలీసులు దిలీప్ ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యాడు. ఆయన రాగానే మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ సభ్యత్వం ఇవ్వడం దుమారం రేపింది. ఈ విషయంపైనే స్పందించిన కమల్ అసోసియేషన్ వైఖరిని తప్పుపట్టారు.