Begin typing your search above and press return to search.

కమల్.. ఇదే ఆఖరు కాదు

By:  Tupaki Desk   |   29 Sep 2015 7:30 AM GMT
కమల్.. ఇదే ఆఖరు కాదు
X
తెలుగులో సాగర సంగమం - స్వాతిముత్యం - ఆకలి రాజ్యం - మరో చరిత్ర, శుభసంకల్పం లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించాడు కమల్ హాసన్. కానీ గత రెండు దశాబ్దాల నుంచి డైరెక్ట్ తెలుగు సినిమా చేయనే లేదు. ఐతే ఎట్టకేలకు ఆయన్నుంచి ఓ తెలుగు సినిమా వస్తోంది. అదే.. చీకటి రాజ్యం. ఐతే ఇది డైరెక్టు తెలుగు సినిమా కాదు. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. తెలుగు ప్రేక్షకులపై అభిమానాన్ని ఈ రకంగానైనా చాటుకున్నందుకు సంతోషమే. ఐతే ఇలా ద్విభాషా చిత్రం చేయడం ఇదే ఆఖరు కాదని.. ఇకముందూ ఇలాగే ఒకేసారి రెండు భాషల్లో సినిమాను తెరకెక్కిస్తానని అంటున్నాడు కమల్.

‘‘తెలుగు సినిమాలతోనే నేను జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నా. తమిళం కంటే తెలుగులోనే నా సినిమాలు బాగా ఆడాయి. కాబట్టి తెలుగులో సినిమా చేస్తే అద్భుతంగా ఉండాల్సిందే. మామూలు కథలతో సినిమాలు చేస్తే నా గత సినిమాల స్థాయిని అందుకోగలనా అన్న సందేహం ఉండేది. అందుకే తెలుగులో నటించలేదు. చీకటి రాజ్యం రూపంలో ఓ అసాధారణ కథ దొరకడంతో మళ్లీ తెలుగులో సినిమా చేశా. ఐతే కమల్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు తెలుగులో సినిమా చేశాడు.. మళ్లీ ఇంకెప్పుడో అనుకోవద్దు. నా తర్వాతి సినిమా కూడా తెలుగు, తమిళ భాషల్లో చేయబోతున్నా. ఇకపై ఇలాగే చేయాలనుకుంటున్నా’’ అని చెప్పాడు కమల్.

చీకటి రాజ్యం సినిమా కోసం కెమెరాని ఒకే చోట పెట్టి రెండు సన్నివేశాలు మాత్రమే తీశామని.. మిగతా అంతా సినిమా పరుగెడుతూనే ఉంటుందని.. ప్రేక్షకులు ఆద్యంతం థ్రిల్ కు గురయ్యేలా సినిమా ఉంటుందని కమల్ చెప్పాడు.