Begin typing your search above and press return to search.

కమల్‌ హాసన్‌తో పెట్టుకుంటారా?

By:  Tupaki Desk   |   18 March 2015 3:30 PM GMT
కమల్‌ హాసన్‌తో పెట్టుకుంటారా?
X
సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ ప్రస్థానం కమల్‌ హాసన్‌ది. ఇప్పటికీ కుర్రాళ్లతో పోటీ పడుతూ నిత్యనూతనంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు ఈ లెజెండ్‌. ఫిలిం మేకింగ్‌, మార్కెటింగ్‌ విషయంలో అప్‌ టు డేట్‌గా ఉండే కమల్‌ రెండేళ్ల కిందట 'విశ్వరూపం' సినిమాతో ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. తన సినిమాను థియేటర్లలోనే కాకుండా డీటీహెచ్‌ ద్వారా ఇంటింటికీ విడుదల చేయాలని సంకల్పించారు. థియేటర్లకు రావడం ఇష్టం లేని వాళ్లు డీటీహెచ్‌ సర్వీస్‌ ద్వారా డబ్బులు చెల్లించి సినిమా చూసే అవకాశం కల్పించాలని చూశారు.

కమల్‌ ఆలోచనను డీటీహెచ్‌ కంపెనీలు స్వాగతించాయి. ఇద్దరి మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఐతే ఆయన ప్రయత్నం పెద్ద వివాదమైంది. థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఇందుకొప్పుకోలేదు. ఇలా చేస్తే తమ ఆదాయం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీటీహెచ్‌లో ప్రసారం చేస్తే విశ్వరూపం చిత్రాన్ని తాము థియేటర్లలో ప్రదర్శించబోమని తెగేసి చెప్పారు కొందరు డిస్ట్రిబ్యూటర్లు. దీంతో కమల్‌ ప్రయోగం ఫలించలేదు. ఈ విషయాన్ని తేలిగ్గా వదలని కమల్‌.. కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఐతే కమల్‌ ఎప్పుడు తమ చేతికి చిక్కుతాడా అని ఎదురు చూసిన డిస్ట్రిబ్యూటర్లు.. ఆ కేసు వెనక్కి తీసుకుంటే తప్ప కమల్‌ కొత్త సినిమా 'ఉత్తమ విలన్‌' విడుదల కానివ్వబోమని అడ్డు తగిలారు. ఐతే కమల్‌ ఇలాంటి బెదిరింపులకు లొంగే టైపు కాదు కదా. ఏం చేసుకుంటారో చేసుకోండి.. కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. మరి ఇరు వర్గాలూ తగ్గకుంటే 'ఉత్తమ విలన్‌' విడుదల ఎలా అన్నదే సందేహం.