Begin typing your search above and press return to search.

కమల్ మాటలు.. తూటాల్లా పేలాయి

By:  Tupaki Desk   |   8 Nov 2015 11:30 AM GMT
కమల్ మాటలు.. తూటాల్లా పేలాయి
X
సినిమా వాళ్లదంతా మిడిమిడి జ్నానం అంటారు చాలామంది. ముఖ్యంగా నటీనటులకు దేశంలో ఏం జరుగుతోందని పట్టదని.. వాళ్ల ప్రపంచం చాలా చిన్నదని, వాళ్లకు ప్రపంచ జ్నానం చాలా తక్కువని విమర్శిస్తుంటారు మిగతా రంగాల వాళ్లు. ఇందుకు ఉదాహరణలు కూడా చాలానే కనిపిస్తుంటాయి. కానీ అందరినీ ఆ గాటన కట్టేయలేం. కమల్ హాసన్ నే చూడండి.

కమల్ రాసే కథలు, స్వీయ దర్శకత్వంలో చేసే సినిమాలే చెబుతాయి.. ఆయన స్థాయి ఏంటన్నది. ఇక ఆయనేదైనా అంశంపై మాట్లాడితే అందులో ఎంత డెప్త్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. దేశంలో కొన్ని రోజులుగా పెద్ద చర్చనీయాంశం అవుతున్న అసహనం (ఇంటాలరెన్స్) గురించి ఆయన చేసి వ్యాఖ్యలు చాలామందికి చెంపపెట్టు. ఐతే కమల్ జ్నానమే చాలాసార్లు ఆయనకు వివాదాలు కూడా తెచ్చిపెడుతుంటుంది. ఐతే తన 61వ పుట్టిన రోజు సందర్భంగా తనను విమర్శించే వారికి, వివాదాల్లోకి లాగే వారికి కౌంటర్లు ఇస్తూ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చక్కటి ప్రసంగం చేశారు కమల్. ఆ సందర్భంగా ఆయనేమన్నారో చూడండి.

‘‘నా సిద్ధాంతాల గురించి ఇప్పటికే చాలాసార్లు వెల్లడించాను. నేను రాజకీయవాదిని కాదు. రాజకీయాల్లోకి ఇకపై వచ్చే ఆలోచనా లేదు. అలాగే నేను నాస్తికుడిని. ఆస్తికుడి కాలేను. అలాగని ఆస్తికత్వాన్ని వ్యతిరేకించను. నాకు స్వర్గం ఇక్కడే, నరకం ఇక్కడే. రెండింటినీ ఇక్కడే అనుభవిస్తాను. ఒక అతీంద్రీయ శక్తులున్న మాంత్రికుడు ఎదురయితే షేక్‌ హ్యాండ్ ఇస్తాను తప్పితే.. నమస్కారం చేయను. దేవుళ్లు అనే వారిని ఒక పక్క ఉండనీయండి. పశుమాంసం తినడం గురించి పెద్ద దుమారే చెలరేగుతోంది. ఈ విషయంలో ఎవరి ఇష్టాలను వారికి వదిలేయండి. ఏం తినాలో మెనూ ఇవ్వకండి. అవార్డులు వెనక్కి ఇవ్వనన్న నా నిర్ణయంపైనా విమర్శలు చేస్తున్నారు. అసలు అవార్డులనేవి ప్రభుత్వం ఇచ్చేవి కావు. కొందరు ఉన్నతమైన వ్యక్తులు అవార్డులకు మనల్ని ఎంపిక చేస్తారు. వాటిని వెనక్కి ఇచ్చి వారిని అవమాన పరచలేను. అయినా అవార్డులు తిరిగి ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం ఏమీ ఉండదు’’ అన్నాడు కమల్. ఈ ప్రసంగంలో కమల్ మాట్లాడిన ప్రతి మాటా తూటాలాగే పేలింది.