Begin typing your search above and press return to search.

వంద కోట్లు ఇస్తామన్నారు .. నన్ను ఎవరూ కొనలేరు : కమల్ హాసన్ !

By:  Tupaki Desk   |   5 March 2021 11:34 AM GMT
వంద కోట్లు ఇస్తామన్నారు .. నన్ను ఎవరూ కొనలేరు : కమల్ హాసన్ !
X
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకి ఈసీ షెడ్డ్యూల్ విడుదల చేయగా , దేశం మొత్తం తమిళనాడు , పశ్చిమ బెంగాల్ వైపే చూస్తుంది. ముఖ్యంగా తమిళనాడు లో పలు పార్టీలు అధికారం కోసం ఇప్పటికే తమ వ్యూహాలని అమలు చేసే పనిలో బిజీగా ఉన్నారు. అధికార పక్షమైన అన్నాడీఎంకే తో కలిసి బీజేపీ ఎలాగైనా తమిళనాడు లో పాగా వేయాలని చూస్తుంది. మరోవైపు డీఎంకే , కాంగ్రెస్ తో కలిసి ఈసారి అధికారం తమదే అనే ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కూడా ఈసారి కీలక పాత్ర వహించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కమల్ నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా దీనిపై కమల్ స్పందించారు. తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని , కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు. తమ కూటమి సీఎం అభ్యర్థి కమల్‌ అని, కూటమి ఖరారైనట్టుగా ఎస్ ‌ఎంకే నేత శరత్ ‌కుమార్‌ బుధవారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పొత్తు ఇంకా ఖరారు కాలేదని కమల్‌ ప్రకటించడం చర్చకు దారి తీసింది. ఎన్నికల వాగ్దానాలుగా తరచూ కమల్‌ కొన్ని ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం మహిళలు, యువత, క్రీడాకారులను ప్రోత్సహించే రీతిలో ఏడు వాగ్దానాలు చేశారు. మంచి వాళ్లు వస్తే తన కూటమిలోకి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, రావాలనుకునే వాళ్లు త్వరగా తరలి రావాలని పిలుపునిచ్చారు.

మైలాపూర్‌ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కమల్‌ ప్రసంగిస్తూ అవినీతిపైనే తన యుద్ధమని, అవినీతి పాలకుల్ని తరిమికొట్టడం లక్ష్యంగా, మార్పును ఆశిస్తున్న ప్రజలకు సుపరిపాలన అందించాలన్న కాంక్షతో ముందుకు సాగుతున్నట్టు పేర్కొన్నారు. తనను కొనేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని, వంద కోట్లు ఇస్తామన్నా, తలొగ్గలేదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ డైలాగును తాను గతంలోనే దశవాతారం సినిమాలోనూ ముందే చెప్పినట్టు గుర్తు చేశారు. తనను ఎవరూ కొనలేరని, తనకు ఏడున్నర కోట్ల తమిళ ప్రజలు, ఈ ప్రజల నెత్తిన భారంగా ఉన్న రూ.5.70 లక్షల కోట్లు అప్పును తీర్చడం లక్ష్యం అని వ్యాఖ్యానించారు.