Begin typing your search above and press return to search.
జాతీయగీతం వివాదం...కమల్ కామెంట్స్!
By: Tupaki Desk | 25 Oct 2017 12:38 PM GMTథియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించడంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాలకు వచ్చే వారు అక్కడ దేశభక్తిని చాటాల్సిన అవసరముందా అని పలువురు గతంలో కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వ కార్యాలయాలు - అసెంబ్లీ - సచివాలయాలు వంటి చోట్ల ప్రతిరోజూ జాగీయ గీతాన్ని ఆలపించడం లేదని, అటువంటపుడు థియేటర్లలో మాత్రం ఈ నిబంధన ఎందుకని సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఇటీవలే దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. సుప్రీం సూచన తర్వాత తమిళ హీరో అరవింద స్వామి ఆ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో అమలవుతున్న ఆ నిబంధన సమంజసం కాదని చెప్పారు. తాజాగా, ఈ అంశంపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడాన్ని కమల్ తప్పుబట్టారు.
కొంతకాలంగా తమిళ రాజకీయాలపై, సామాజిక అంశాలపై కమల్ చురుగ్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ అంశంపై కూడా కమల్ తనదైన శైలిలో స్పందించారు. ప్రజలపై ఏ అంశాన్నైనా బలవంతంగా రుద్దకూడదడని కమల్ అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో ప్రభుత్వం జాతీయ గీతాన్ని నిర్దేశిత సమయంలో టీవీలో ప్రసారం చేయిస్తుందన్నారు. అదే తరహాలో, మన ప్రభుత్వం కూడా దూరదర్శన్ ఛానెల్ లో ఏదో ఒక టైంలో ప్రదర్శించాలని అభిప్రాయపడ్డారు. వినోదం కోసం వచ్చే థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడం, తమ దేశభక్తిని చాటుకోవడానికి జనాలు లేచి నిలుచోవాలని షరతు పెట్టడం సమంజసం కాదని కమల్ అన్నారు.
మరో తమిళ నటుడు అరవింద్ స్వామి కూడా ఈ వివాదం పై ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. గవర్నమెంట్ ఆఫీసులు - కోర్టులు - అసెంబ్లీలు - పార్లమెంటు హాలులో రోజూ జాతీయ గీతం ఎందుకు ఆలపించరన ఆయన ట్విట్టర్లో ప్రశ్నించారు. కేవలం..వినోదం కోసం వచ్చే సినిమా హాళ్లలోనే జాతీయ గీతం వినిపించడం ఎందుకు తప్పనిసరి చేశారని ప్రశ్నించారు. తాను, జాతీయగీతం ఎప్పుడు వినిపించినా లేచి నిలబడతానని, జాతీయగీతం ఆలపిస్తానని అన్నారు. మరోవైపు, గతంలో థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడాన్ని సమర్థించిన సుప్రీం కూడా పునరాలోచనలో పడింది. మరి, సుప్రీం సూచన మేరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.