Begin typing your search above and press return to search.

రజినీ రాజకీయాల్లోకి రావాలన్న కమల్

By:  Tupaki Desk   |   30 April 2016 11:10 AM GMT
రజినీ రాజకీయాల్లోకి రావాలన్న కమల్
X
దశాబ్దాలుగా సినీ నేపథ్యం ఉన్న వాళ్లే తమిళనాడును పాలిస్తున్నారు. మున్ముందు కూడా ఇదే సంప్రదాయం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి రావాలని చాలామంది పెద్ద హీరోలకు ఉంది. ఐతే జనం ఎక్కువగా సూపర్ స్టార్ రజినీకాంత్ వైపు చూస్తున్నారు. ఆయన ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రభ ముందు ఇంకెవ్వరూ సాటి రారు. వ్యక్తిగా మంచి పేరు కూడా ఉన్న రజినీ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ రజినీ మాత్రం ఆ సాహసం చేయట్లేదు. చివరికి రజినీ మిత్రుడైన కమల్ హాసన్ సైతం రజినీని రాజకీయాల్లోకి రావాలని అనడం విశేషం.

నిన్న తన కొత్త సినిమా ‘శభాష్ నాయుడు’ ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయాల గురించి.. ఎన్నికల గురించి మాట్లాడిన కమల్.. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని.. రజినీ లాంటి వాళ్లు కచ్చితంగా రాజకీయ రంగప్రవేశం చేయాలని కమల్ అభిప్రాయపడ్డారు.

ఐతే రజినీని రాజకీయాల్లోకి వెళ్లమంటున్న కమల్.. తన రాజకీయ రంగప్రవేశం గురించి మాత్రం మాట్లాడకపోవడం విశేషం. తనకు రాజకీయాలు సరిపడవని కమల్ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రజినీకాంత్ విషయానికొస్తే.. దశాబ్దం కిందటే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరిగింది. ఐతే 2004 ఎన్నికల సందర్భంగా రజినీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించగా.. ఆ పార్టీ తమిళనాట పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను ఆయన మానుకున్నట్లు చెబుతారు.