Begin typing your search above and press return to search.

కమల్ తో సినిమా అనౌన్స్ చేసిన 'ఖైదీ' డైరెక్టర్...!

By:  Tupaki Desk   |   16 Sep 2020 4:30 PM GMT
కమల్ తో సినిమా అనౌన్స్ చేసిన ఖైదీ డైరెక్టర్...!
X
కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఖైదీ” సినిమా తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అప్పటికే 'మా నగరం' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా తీసిన లోకేష్.. 'ఖైదీ' సినిమా సక్సెస్ తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ సినిమాతో టాలీవుడ్ లో కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ - 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కాంబినేషన్ లో లోకేష్ తెరకెక్కించిన 'మాస్టర్' చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేస్తాడు.. ఏ హీరోతో చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో కూడా లోకేష్ తదుపరి సినిమా ఎవరితో అనేది హాట్ టాపిక్ గా నిలిచింది. ఇదే క్రమంలో కనగరాజ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు లోకేష్ కనగరాజ్.

కాగా, లోకనాయకుడు కమల్ హాసన్ తో తన తదుపరి సినిమాని ప్రకటించాడు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్ కెరీర్లో 232వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కమల్ తన హోమ్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్సమెంట్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్.. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని.. 2021 సంవత్సరానికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుపుతామని ప్రకటించారు. ''ఒకానొకప్పుడు ఇక్కడ ఒక ఘోస్ట్ నివసించింది'' అంటూ పోస్టర్ లో గన్స్ తో కమల్ చిత్రాన్ని డిజైన్ చేసినట్లు చూపించారు. ఈ చిత్రానికి యువ సంచలనం అనిరుధ్ సంగీతం అందిచనున్నాడు.