Begin typing your search above and press return to search.

రెండు గంటలు ఎలా గడుస్తాయో తెలియదు

By:  Tupaki Desk   |   14 Aug 2015 7:17 AM GMT
రెండు గంటలు ఎలా గడుస్తాయో తెలియదు
X
తన సినిమాల గురించి ఎప్పుడూ గొప్పలు చెప్పుకోడు కమల్ హాసన్. ఐతే తన కొత్త సినిమా ‘చీకటి రాజ్యం’ గురించి ఆయన చాలా మాట్లాడుతున్నారు. షూటింగ్ మొదలుపెట్టకముందు నుంచి ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని చెబుతున్నారు. తన శిష్యుడు రాజేష్ సెల్వ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుందని.. రెండు గంటలు ఎలా గడిచాయో తెలియకుండా సాగిపోతాయని అంటున్నాడు. కేవలం 40 రోజుల్లోనే ‘చీకటి రాజ్యం’ షూటింగ్ పూర్తి చేసిన కమల్.. ఈ సినిమా విశేషాల గురించి పాత్రికేయులతో పంచుకున్నాడు.

‘‘చీకటి రాజ్యం ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. తెలుగు సినిమా చేస్తాను అన్న మాట నిలబెట్టుకుంటున్నా. రాజేష్‌ నా శిష్యుడు. ఏడేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికి తనతో సినిమా చేయడం కుదిరింది. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు. ఓ కొత్త పంథాలో సాగే చిత్రమిది. ఓ రాత్రి జరిగే కథ ఇది. నాలుగు విభిన్నమైన పాత్రల చుట్టూ నడుస్తుంది. 40 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. జిబ్రాన్‌ సంగీతం ఆకట్టుకొంటుంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం'' అని కమల్ చెప్పారు.

అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరులో ఆడియో విడుదల చేసి.. దసరా కానుకగా తమిళ, తెలుగు భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ వెర్షన్ కు తూంగా వనం (నిద్రపోతున్న నగరం) అని టైటిల్ పెట్టారు.