Begin typing your search above and press return to search.

మన లెజెండ్స్‌పై కమల్‌కు ఎంత గౌరవమో

By:  Tupaki Desk   |   20 March 2015 3:30 PM GMT
మన లెజెండ్స్‌పై కమల్‌కు ఎంత గౌరవమో
X
అందుకే కమల్‌ ది గ్రేట్‌ అంటారు. ఆయనెంత గొప్పవాడైనా మిగతా గొప్ప వాళ్ల గురించి మరిచిపోరు. ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చిన మన లెజెండ్స్‌ను గుర్తు చేసుకుని.. మనకు తెలియని వారి గొప్పదనాన్ని మనకు తెలియజెప్పి వెళ్తుంటారు. 'ఉత్తమ విలన్‌' టీజర్‌ రిలీజ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన లోకనాయకుడు మన దిగ్గజ నటుల గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా మాట్లాడారు. ఆయనేమన్నారో చూడండి.

''ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, ఎస్వీఆర్‌.. వీళ్లంగా నాకు స్ఫూర్తే. ఓ రోజు ఎన్టీఆర్‌ గారు చెన్నై నుంచి హైదరాబాద్‌ షూటింగ్‌కి నేరుగా కృష్ణుడి గెటప్‌లో రావడం నాకింకా గుర్తే. ఆయన్ను అలా చూసి జనాలు ఏమనుకున్నా అనుకోనివ్వండి. మేకప్‌ కోసం ఖర్చు పెట్టే డబ్బును, సమయాన్ని ఆదా చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈ రోజుల్లో అలా ఆలోచించేవాళ్లు ఎందరున్నారు. వరల్డ్‌ రికార్డులు, గిన్నిస్‌ రికార్డులూ ఇలాంటి ఆలోచనలకు కూడా ఇవ్వాలి.

ఇంకో ఉదాహరణ చెబుతా. ఓసారి ఊటీలో షూటింగ్‌ జరుగుతుండగా తెల్లవారుజామున నాలుగున్నరకు లేవాల్సి వచ్చింది. పక్క రూం నుంచి శబ్దాలు వస్తుంటే ఏం జరుగుతోందో అని వెళ్లి చూస్తే ఎన్టీఆర్‌ గారు వ్యాయామం చేస్తున్నారు. నేను అవసరం అనుకుంటే తప్ప అంత తెల్లవారుజామున లేవను. కానీ ఎన్టీఆర్‌ గారు లేచి ఎక్సర్‌సైజ్‌ చేస్తున్నారు. మీరు ఫిట్‌గా ఉండండి అంటూ రాఘవేంద్రరావుగారు ఎన్టీఆర్‌ గారికి చెప్పలేదు. ఆయన క్రమశిక్షణ, నిబద్ధత అలాంటివి. ఇవన్నీ చూస్తూ పెరిగిన వాణ్ని వాళ్ల నుంచి నేర్చుకోకుంటే ఎలా'' అని కమల్‌ అన్నారు. ఎస్వీరంగారావు లాంటి నటుడు మళ్లీ రారని అందరూ అంటుంటారని.. అది వింటే మనసు చివుక్కుమంటుందని.. రాడు అనడం ఆశీర్వాదం కాదు, శాపం అని అన్నారు కమల్‌.