Begin typing your search above and press return to search.

'బాహుబలి' బాటలోనే కమల్ మూవీ 'విక్రమ్'

By:  Tupaki Desk   |   1 Oct 2021 12:30 PM GMT
బాహుబలి బాటలోనే కమల్ మూవీ విక్రమ్
X
కమలహాసన్ ఆ మధ్య శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా ఆగిపోయింది. దాంతో తన సొంత బ్యానర్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా 'విక్రమ్' సినిమాకి శ్రీకారం చుట్టారు. మొదటి నుంచి కూడా కమల్ ప్రయోగాత్మకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. అలా ఆయన తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేశారు. అశేష ప్రేక్షకుల చేత ప్రశంసలను అందుకున్నారు.

కమల్ తనకి నచ్చిన కథలను తెరకెక్కించడానికి నిర్మాతలు సాహసించకపోతే, తానే నిర్మాతగా మారిపోతుంటారు. ప్రయోగాత్మక పాత్రల విషయంలో ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి సినిమాల వలన నష్టాలు వచ్చినా ఆయన పెద్దగా బాధపడరు. ఒక మంచి ప్రయత్నం చేశామని సంతృప్తిని పొందడం ఆయన ప్రత్యేకత. ఈ సారి కూడా అలాగే ఆయన 'విక్రమ్' సినిమా కోసం రంగంలోకి దిగారు. ఈ సినిమా కోసం ఆయన దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ ను ఎంచుకున్నారు. ఈ మధ్య కాలంలో తమిళనాట మురుగదాస్ తరువాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది.

లోకేశ్ కనగరాజ్ 'మానగరం' (నగరం) అనే ఒక చిన్న సినిమాతో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టాడు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్క్రీన్ ప్లే తో ఈ కథ నడుస్తుంది. ఆ తరువాత కార్తి హీరోగా ఆయన 'ఖైదీ' చేశాడు. సినిమా మొత్తం హీరోను సింగిల్ కాస్ట్యూమ్ తో చూపిస్తూ, బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షాన్ని కురిపించాడు. ఇది కూడా స్క్రీన్ ప్లే తో నడిచే సినిమానే. ఆ తరువాత నేరుగా ఆయన విజయ్ హీరోగా 'మాస్టర్' సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆయన ప్రతిభాపాటవాలను గమనిస్తూ వచ్చిన కమల్ .. ఆయనకి అవకాశం ఇచ్చారు.

ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది.కొన్ని రోజులుగా 'కారైక్కుడి'లో షూటింగు జరుగుతోంది. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే 'విక్రమ్' కథా పరిధి ఎక్కువగా ఉంటుందట. పాత్రలు .. మలుపులు .. నాటకీయత ఎక్కువగా ఉండటం వలన, ఈ కథను రెండు భాగాలుగా చెబితే బాగుంటుందనే అభిప్రాయాన్ని లోకేశ్ కనగరాజ్ వ్యక్తం చేయగా, కమల్ అందుకు అంగీకరించారని అంటున్నారు. అందువలన ముందుగా ఫస్టు పార్టును పూర్తి చేసే పనిలో ఉన్నారట.

గతంలో 'బాహుబలి' విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. రెండు భాగాలు కూడా సంచలన విజయాలను సాధించాయి. ఇక ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' కూడా రెండు భాగాలుగానే రానుంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో పాత్రల సంఖ్య ఎక్కువ. ఆ పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరించడానికీ, అవి జనాలకు కనెక్ట్ కావడానికి రెండు భాగాలుగా చేయడమే సరైనదిగా భావించి అలాగే చేస్తున్నారు. ఇక తెలుగులో సుకుమార్ చేస్తున్న 'పుష్ప' సినిమాను కూడా రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 'విక్రమ్ కూడా అదే బాటలో నడవనుందన్న మాట.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన కాన్సెప్ట్ వీడియో అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. కమల్ మరో ప్రయోగం చేస్తున్నారనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఆయన లుక్ కు మంచి మార్కులు పడిపోయాయి. ఇక స్క్రీన్ ప్లే పై మంచి పట్టున్న దర్శకుడిగా లోకేశ్ కనగరాజ్ కి మంచి పేరు వచ్చింది. ఆయనపై ప్రేక్షకులకు ఒక నమ్మకం ఏర్పడింది. కీలకమైన పాత్రలతో విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ ఈ సినిమాపై క్రేజ్ ను మరింతగా పెంచుతున్నారు. ముఖ్యమైన పాత్రల్లో నరేన్ .. అర్జున్ దాస్ .. ఆండ్రియా .. మేఘ ఆకాశ్ కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.