Begin typing your search above and press return to search.

రైతు కోసం హీరోలే కదిలారు

By:  Tupaki Desk   |   6 Dec 2018 3:14 PM GMT
రైతు కోసం హీరోలే కదిలారు
X
దేశానికి వెన్నెముక రైతే అని పుస్తకాల్లో చదువుతాం కాని నిజానికి అత్యంత నిర్లక్షానికి గురవుతుంది అతనే. మనకు ఎన్ని సౌలభ్యాలు వసతులు లభించినా పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం కోసం రైతు ఇప్పటికీ మార్కెట్ యార్డుల దగ్గర పోరాడుతూనే ఉంటాడు. వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ సినిమా పరిశ్రమలో మరీ తక్కువ. కాని ఒక్క రైతు కోసం సినిమా హీరోలే కదిలిపోయిన సంఘటన ఇది.

అతని పేరు నెల్ జయరామన్. గత ఏడాది సంప్రదాయ ఆహార ధాన్యాలను పండించడంలో ఛాంపియన్ గా నిలిచి దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. 174 పైగా వివిధ రకాల ఆహార ధాన్యాలను భద్రపరిచిన అరుదైన రికార్డు కూడా నెల్ జయరామన్ మీద ఉంది. ఎందరో హీరోలు సెలెబ్రిటీలు జయరామన్ కు కలిసి అతని విజయ రహస్యాలు తెలుసుకోవడం అతని ఘనతలను ప్రపంచానికి పరిచయం చేయడం చేసారు.

ఇప్పుడా నెల్ జయరామన్ కన్ను మూసారు. వ్యవసాయ క్షేత్రంలో విజేతగా నిలిచిన జయరామన్ నిజ జీవిత యుద్ధంలో క్యాన్సర్ తో పోరాడలేక చివరికి తనువు చాలించాడు. ఇది విన్న రైతు వర్గాలు కన్నీరు మున్నీరు అవుతుండగా తమిళ తారలు సైతం ఆయన మరణానికి కదిలిపోయారు. శివ కార్తికేయన్ అతను చెన్నై ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అన్ని ఖర్చులు భరించడమే కాదు జయరామన్ పార్ధీవ దేహం స్వగ్రామానికి వెళ్లేందుకు సహాయం చేసాడు. విశాల్ తన ట్విట్టర్ లో తీవ్ర సానుభూతి వ్యక్తం చేసాడు. కమల్ హాసన్ సైతం విచారం వ్యక్తం చేసారు. సత్యరాజ్-కార్తీ లాంటి ప్రముఖులు ఆసుపత్రికి వచ్చి చివరి సారి దర్శించుకున్నారు. ఇంత గొప్ప ఆదరణ పొందిన జయరామన్ ఇలా కాలం చేయడం అందరిని కదిలిస్తోంది