Begin typing your search above and press return to search.

కమ్మ రాజ్యంలో కడప రెడ్ల టైటిల్ సాంగ్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   9 Aug 2019 7:50 AM GMT
కమ్మ రాజ్యంలో కడప రెడ్ల టైటిల్ సాంగ్ లో ఏముంది?
X
నేను మాట మీద నిలబడను. ఎందుకంటే.. కదిలే కాలంతో పాటు ఆలోచనలు మారుతుంటాయి. పరిస్థితులు మారుతాయి. దానికి తగ్గట్లుగా అభిప్రాయాలు మారిపోతుంటాయన్న మాటలకు తగ్గట్లే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మాటలు ఉంటాయి. తాను అత్యంత వివాదరహితంగా తీసిన సినిమాగా చెప్పే కమ్మ రాజ్యంలో కడప రెడ్ల చిత్రం గురించి చెప్పిన ఆయన మాటలో నిజం ఎంతన్నది తాజాగా ఆయన విడుదల చేసిన టైటిల్ సాంగ్ ను చూస్తేనే అర్థమైపోతుంది.

అత్యంత వివాదరహిత చిత్రంలో వివాదాస్పద వ్యక్తులంటూ తన మార్క్ ట్విస్ట్ తో పాటు.. టైటిల్ సాంగ్ మొత్తం చూస్తే పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయేలా సాంగ్ ఉండటం గమనార్హం. సినిమాకు సంబంధించి టైటిల్ కార్డు తప్పించి ఒక్కటంటే ఒక్క షాట్ కూడా రివీల్ చేయని వర్మ.. తన సినిమా ఎలా ఉంటుందన్న దానిపై తాజా పాటతో ఒక క్లారిటీ ఇచ్చేశారు.

యుద్ధం చేసే పద్దతి మొత్తం మారిపోయిందని.. రక్తంతోనూ.. కత్తులతో కాదు.. వ్యూహాలతో.. చిరునవ్వులతో షాకులిచ్చే తీరును ఆయన తన పాటలో చూపించేశారు. దాదాపు 4 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్న పాట ప్రారంభాన్ని జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారంచేసిన సీన్ తో షురూ చేశారు. ఆ వెంటనే ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఆవేశాల్ని చూపించిన ఆయన.. స్పీకర్ తో పాటు.. పలువురు నేతల మాటల్ని కూడా చూపించారు.

ఈ పాటలో చెప్పిందేమిటి? అన్న విషయాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే యుద్ధం చేసే తీరు మారింది.. పవర్లోకి వచ్చే వరకే ప్రజాస్వామ్యం.. ఎన్నికల వేళలోనే మాటలు.. ఆ తర్వాత అంతా అంతే అంటూ సాగిన మాటలు కొత్త సందేహాల్ని తెర మీదకు తెచ్చేలా చేస్తాయని చెప్పాలి. పాట ఆరంభం నుంచి చివరి వరకూ ఇటీవల కాలంలో ఏపీలో చోటు చేసుకున్న పలు కీలక పరిణామాల్ని చూపించటం.. చివరకు విదేశాల్లో రోడ్డు మీద బాబు పల్లీలు తిన్న షాట్ తో పాటు.. వివిధ మీడియా సంస్థల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను చూపిస్తూ తన పాటను పూర్తి చేశారు. సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా పాట ఉందని చెప్పాలి.

అంతేకాదు.. వివాదరహితంగా తన సినిమా ఉంటుందని వర్మ చెప్పినప్పటికీ.. అలాంటిదేమీ లేదన్న విషయం తాజాగా విడుదల చేసిన టైటిల్ సాంగ్ తో స్పష్టమవుతుందని చెప్పాలి. తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో చంద్రబాబును నెగిటివ్ గా చూపించిన వర్మ.. తన తాజా చిత్రంలో కమ్మ వర్గాన్ని నెగిటివ్ గా చూపించనున్నారా? అన్న సందేహం కలుగక మానదు. అదే జరిగితే.. ఈ సినిమా ఎంత వివాదం కావాలో అంత వివాదం అవుతుందని చెప్పక తప్పదు. నిప్పు కాలకుండా ఉంటుందా? సూరీడు తూర్పున ఉదయించకుండా ఉంటాడా? నీరు పల్లానికి వెళ్లకుండా ఉంటుందా? వర్మ.. వివాదాలతో సహవాసం చేయకుండా ఉంటాడా?