Begin typing your search above and press return to search.

మహేష్‌ ను వదిలేశావా కమ్ములా?

By:  Tupaki Desk   |   26 Jan 2016 1:30 PM GMT
మహేష్‌ ను వదిలేశావా కమ్ములా?
X
శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమాపై బలమైన ముద్ర యువ దర్శకుల్లో ఒకడు. చాలా తక్కువ సినిమాలతోనే తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పరుచుకుని.. ఓ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడా సంపాదించుకున్న కమ్ముల.. అంచెలంచెలుగా బాగానే ఎదిగాడు. ఐతే తర్వాతి దశకు వెళ్తాడనుకుంటున్న టైంలో తన సినిమాను తనే కాపీ కొట్టి తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఆయన్ని పాతాళానికి పడేసింది. మళ్లీ అక్కణ్నుంచి లేవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘అనామిక’తో మరింత కిందికి వెళ్లిపోయాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల అనే దర్శకుడొకడు తెలుగు పరిశ్రమలో ఉన్నాడన్న సంగతే మరిచిపోయారు జనాలు.

ఈ స్థితిలో మహేష్ బాబుతో కమ్ముల సినిమా అంటూ ఈ మధ్య ప్రచారం జరిగింది. ఒకవేళ ఆ వార్త నిజమైపోతుందేమో అని ఆసక్తిగా చూశారు జనాలు. కానీ అదేమీ జరగలేదు. మహేష్ కమ్ముల కథకు ఓకే చెప్పాడో లేదో కానీ.. అతనైతే మరో రెండు మూడేళ్ల దాకా ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. దీంతో కమ్ముల ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు పక్కనబెట్టేసి.. ఎప్పుట్నుంచో పెండింగులో ఉన్న ‘హ్యాపీడేస్’ హిందీ రీమేక్ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నాడు. ఆ చిత్రాన్ని శేఖర్ కపూర్‌తో కలిసి నిర్మించబోతున్నాడు కమ్ముల. హిందీలోనూ దాదాపుగా అందరూ కొత్తవాళ్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు కమ్ముల. ఐతే ‘హ్యాపీడేస్’ ఔట్ డేట్ అయిపోయిన మూవీ ఏమీ కాదు కానీ.. ఎప్పుడో 8-9 ఏళ్ల కిందట తీసిన సినిమాను ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేయడానికి పూనుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇప్పుడా మూవీ కమ్ములకు ఏం ఎగ్జైట్మెంట్ కలిగిస్తుందో.. అసలే తెలుగులో బాగా డల్లయిపోయిన తన కెరీర్‌ను అతనెప్పుడు చక్కబెట్టుకుంటాడో.. అన్నదే అర్థం కాని విషయం.