Begin typing your search above and press return to search.

ద‌య‌చేసి కంగ‌న‌ను రాజ‌కీయాల్లోకి పిల‌వొద్దు!

By:  Tupaki Desk   |   10 Sep 2021 3:32 PM GMT
ద‌య‌చేసి కంగ‌న‌ను రాజ‌కీయాల్లోకి పిల‌వొద్దు!
X
సూటిపోటి విమ‌ర్శ‌ల‌తో వ్యంగ్యంతో ప్ర‌త్య‌ర్థుల‌కు తూట్లు పొడ‌వ‌డంలో క్వీన్ కంగ‌న ర‌నౌత్ స‌త్తా గురించి ప్ర‌త్యేకించి గుర్తు చేయాల్సిన అవ‌స‌రం లేదు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్నో నిరంత‌రం మీడియాల వేదిక‌గా చూస్తున్న‌దే. క్వీన్ కంగ‌న - రంగోలి సిస్ట‌ర్స్ కి ఉన్న మాట‌కారిత‌నం దురుసుత‌నంపైనా అభిమానులకు చాలా అంచ‌నాలున్నాయి.

ఇటీవ‌ల కంగ‌న సాహ‌సాల గురించి కూడా చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌హారాష్ట్ర లో ప‌వ‌ర్ పాలిటిక్స్ న‌డిపించే ఏలిక‌ల‌నే గ‌గ్గోలు పెట్టించిన ఘ‌న‌త త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైంది. హిమ‌చ‌ల్ బ్యూటీ కంగ‌న ర‌నౌత్ మ‌హారాష్ట్ర శివ‌సేన‌ నాయ‌కుల‌నే చెవులు ప‌ట్టుకుని ఆడించేసింది. అలాంటిది కంగ‌న‌ను రాజ‌కీయాల్లోకి ఆహ్వానిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌న‌ల‌వి కానిది. అన్న‌ట్టు కంగ‌న‌ను ఆహ్వ‌నిస్తే రాజ‌కీయాల్లోకి వ‌స్తుందా? అంటే.. ఆమె నుంచి ఊహించ‌ని జ‌వాబు వ‌చ్చింది.

త‌న త‌దుప‌రి చిత్రం `తలైవి` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రాజధానిలో విలేకరుల సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది. కంగనా తన తాజా సినిమాలో కథానాయిక జ‌య‌ల‌లిత‌లానే తాను కూడా రాజకీయాల్లోకి దూసుకెళ‌తాన‌ని వ్యాఖ్యానించ‌డం క‌ల‌క‌లం రేపింది. కంగనా విలేకరుల సమావేశంలో త‌గ్గు స్వరం తో మాట్లాడింది. ``వాతావ‌ర‌ణం చల్లగా ఉన్నందున నా స్వరం కొద్దిగా తగ్గింది. ఇది కోవిడ్ కాదు.. ప్ర‌చారం కోసం ఇక్కడికి వ‌చ్చాము. కెరీర్ లో నేను ఈ మలుపును ఆనందిస్తున్నాను`` అంటూ స‌ర‌దాగా నవ్వేశారు కంగ‌న‌.

జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్ర‌సంగించిన‌ కంగన ఇప్పుడు దక్షిణాదికి ప‌రిచ‌య‌మ‌వుతున్నందున‌ రాజకీయాల్లోకి రావడానికి ఈ సినిమా ఏమైనా సహాయపడుతుందా? అని విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ఈ సినిమా హిందీలో మల్టీప్లెక్స్ లో విడుదల కాకపోవచ్చు. మల్టీప్లెక్స్ లు ఎల్లప్పుడూ నిర్మాతలను వేధించడానికి ప్రయత్నిస్తాయి. వారంతా ఒకటే. నేను ఒక జాతీయవాదిని. నేను దేశం కోసం మాట్లాడుతున్నాను.. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు.. బాధ్యతాయుతమైన పౌరురాలిని.. రాజకీయాల్లోకి వచ్చేంత వరకు నాకు ప్రజల నుండి చాలా మద్దతు అవసరం కావచ్చు.. కానీ ప్రస్తుతం నేను నటిగా సంతోషంగా ఉన్నాను. కానీ రేపు ప్రజలు నన్ను ఇష్టపడి నాకు మద్దతు ఇస్తే నేను ఖచ్చితంగా రాజ‌కీయాల్ని ఇష్టపడతాను.. అని తెలిపారు. మొత్తానికి రాజ‌కీయాల‌పైనా కంగ‌న త‌న ఆస‌క్తిని త‌లైవి వేదిక సాక్షిగా బ‌హిర్గ‌తం చేశారు. కంగనతో పాటు నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి కూడా ఈ వేదిక‌పై ఉన్నారు. వేదిక‌పై కంగ‌న‌ సంప్రదాయ బ‌ద్ధంగా సిల్క్ చీరలో కనిపించారు

చూస్తుంటే న‌రేంద్ర‌ మోదీ -భాజ‌పా వ‌ర్గాలు ఆహ్వానిస్తే కంగ‌న పార్టీలో చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ని నెటిజ‌నులు గుస‌గుస‌లాడేస్తున్నారు. కంగ‌న‌లా మాట‌కారిత‌నం ఉన్న‌వాళ్ల‌కు రాజ‌కీయాల్లో భ‌విష్య‌త్ ఉంటుంది. లాయ‌ర్ ని వెంట‌బెట్టుక‌ని త‌గాదాల్ని ప‌రిష్క‌రించుకునే గ‌ట్టి మొండి ప‌ట్టు కూడా త‌న‌కు ఉంది కాబ‌ట్టి రాజకీయాలు కొంత సులువు. త‌మిళ‌నాడుకు అమ్మ జ‌య‌లలిత‌లా.. మ‌నాలి బ్యూటీగా హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ని ఏలేందుకు కంగ‌న‌కు ఆస్కారం లేకపోలేదు సుమీ!

కంగ‌న‌కు ఎందుకంత సెక్యూరిటీ?

బాలీవుడ్ రెబ‌ల్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ డ్యాషింగ్ యాటిట్యూడ్ కి వివాదాస్ప‌ద స్వ‌భావానికి శ‌త్రువులు కూడా అదే రేంజులో పెరుగుతున్నారు. ఇటీవ‌ల రాజకీయ నాయ‌కుల‌తోనూ కోర్టు గొడ‌వ‌లు సంచ‌ల‌నంగా మారాయి. ముఖ్యంగా శివ‌సేన పార్టీ అధినాయ‌కుల‌తోనే కంగ‌న త‌ల‌ప‌డ‌డం హాట్ టాపిక్ గా మారింది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌పై ధీటుగా.. ధైర్యంగా ముందుకెళ్లి ఫైట్ చేస్తోంది. ప్ర‌తిసారీ త‌న‌దైన శైలిలో చెల‌రేగుతూ మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. మీటూ ఉద్య‌మం అయినా.. పారితోషికం విష‌యంలోనైనా.. మ‌హిళా హ‌క్కుల పై నిల‌దీయాల‌న్నా.. దేనికైనా త‌న‌దైన శైలిలో స్పందిస్తోంది కంగ‌న‌. కార‌ణం ఏదైనా ఇటీవ‌ల‌ కంగ‌న‌కు బ‌య‌ట మిత్రుల‌తో పాటు శ‌త్రువులు కూడా త‌య‌రాయ్యారు.

అందుకే కంగ‌న వెంట ఏకంగా ఏకే 47 గ‌న్ తో కేంద్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది త‌న‌వెంటే ఉండ‌డం క‌నిపిస్తోంది. ఇటీవ‌ల బుడాఫెస్ట్ లో `ధాక‌డ్` షూటింగ్ పూర్తి చేసుకుని కంగ‌న ముంబైకి చేరుకుంది. కాగా బుధ‌వారం ఆమె ముంబైలో త‌న వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు సెక్యురిటీ సిబ్బంది త‌న‌కు కాప‌లాగా క‌నిపించ‌డం సందేహాల్ని రేకెత్తించింది. కంగ‌న కు ప్ర‌త్య‌ర్థుల నుంచి థ్రెట్ పెద్ద స్థాయిలోనే ఉంద‌ని ఈ ప‌రిణామం చెబుతోంది. అందుకే ఇంతటి ప‌టిష్ట‌మైన బందోబ‌స్త్ ని కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం కల్పించింది! అన్న ప్ర‌చారం సాగుతోంది. ఇది Y- ప్ల‌స్ కేట‌గిరీ CRPF సెక్యూరిటీ అని తెలిసింది. దీనిని హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. ఇది కంగ‌న‌కు ఉచితంగా అందుబాటులో ఉంది.