Begin typing your search above and press return to search.

కుర్ర‌హీరో ముందు కంగ‌న‌కు ఘోర ప‌రాభ‌వం!

By:  Tupaki Desk   |   24 May 2022 4:45 AM GMT
కుర్ర‌హీరో ముందు కంగ‌న‌కు ఘోర ప‌రాభ‌వం!
X
క్వీన్ కంగ‌న కుర్ర హీరో ముందు త‌ల వొంచింది. త‌న ప‌రాజ‌యాన్ని అంగీక‌రించింది. కంగనా రనౌత్ నటించిన 'ధాకడ్' మొదటి మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌బ‌డి దారుణ‌ పరాజయం పాలైంది! క‌నీస హైక్ ఆశించినా కానీ ఆదివారం నాడు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ గణాంకాలు షాక్ కి గురి చేసాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2000 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమాకి థియేటర్లలో ప్రేక్షకులు రాని పరిస్థితి. సినిమా వసూళ్లు వారాంతాల్లో పెరగడానికి బదులు బాగా తగ్గాయి. ఇది మాత్రమే కాదు.. 'ఏజెంట్ అగ్ని' ని చూడటానికి ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడంతో సినిమాకు సంబంధించిన చాలా షోలు రద్దు చేసారు. తొలిరోజు 1.25 కోట్లు మాత్రమే రాబట్టిన ఈ సినిమా మూడో రోజు అయిన‌ ఆదివారం క‌లుపుకుని 97 లక్షలు (ధాకడ్ డే 3 బాక్స్ ఆఫీస్ కలెక్షన్) మాత్రమే రాబట్టింది.

బాలీవుడ్‌ క్వీన్ గా పిలపందుకున్న‌ కంగనా రనౌత్ కి ఇది పెద్ద ఎదురుదెబ్బ. బాలీవుడ్ వర్సెస్ సౌత్ డిబేట్ లో కంగనా హిందీ చిత్ర పరిశ్రమను నిరంతరం తిట్టిపోస్తూ ఉండగా ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు తీవ్ర అవ‌మాన‌క‌రంగా భావించాల్సి ఉంటుంది. కంగ‌న‌కు ఇది వరుసగా నాలుగో డిజాస్ట‌ర్. కంగనా రనౌత్ తో పాటు ధాకడ్ లో అర్జున్ రాంపాల్ -దివ్యా దత్తా త‌దిత‌రులు నటించారు. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు .. కానీ వసూళ్లను బట్టి చూస్తే.. రజనీష్ ఘయ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లైఫ్ టైమ్ 10 కోట్లు రాబట్టినా అదృష్టమేన‌ని విశ్లేషిస్తున్నారు.

ఆది సోమవారాల్లో చాలా షోలు రద్దయ్యాయి. కంగనా రనౌత్ నటించిన ధాకడ్ మొదటి వారాంతంలో మొత్తం 3.27 కోట్లు వసూలు చేసింది. విడుదలకు ముందు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా హాలులో ఓపెనింగ్ రోజే 10 శాతం సీట్లు మాత్రమే నిండాయి. తొలిరోజు వసూళ్లు రూ.1.25 కోట్లు కాగా రెండో రోజు ఆర్జ‌న‌ పెరగలేదు స‌రిక‌దా మరింత పడిపోయింది. శనివారం రూ.1.05 కోట్లు రాబట్టింది. ఆదివారం అత్యంత షాకింగ్ గణాంకాలు వచ్చాయి. సాధారణంగా ఏ సినిమాకైనా వీకెండ్ లో వసూళ్లు పెరుగుతాయి. గతంలో 'జెర్సీ'- 'బచ్చన్ పాండే'- 'రన్‌వే 34' వంటి చిత్రాలకు కూడా మొదటి వారాంతంలో ప్రాధాన్యత ఉండేది. కానీ 'ధాకడ్' ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. ఈ చిత్రం ఆదివారం కేవలం 97 లక్షల రూపాయలను రాబట్టింది. కాగా సోమవారం చాలా థియేటర్లలో చాలా షోలు రద్దు అయినట్లు వార్తలు వచ్చాయి.

'శర్మజీ జాకే ధాకడ్ దేఖ్ ఆవో కంగనా బెహెన్ కి ఏ లిటిల్ హెల్ప్ హో జాయేగీ' .. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఈ ట్వీట్ అంతర్జాలంలో వైరల్ అయింది. మరోవైపు కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన‌ 'భూల్ భూలయ్యా 2' ఇప్ప‌టికే రూ.54.50 కోట్లు రాబట్టింది. కార్తీక్ ఆర్యన్ - కియారా అద్వానీల భూల్ భూలయ్యా 2.. ధాకడ్'తో పాటు శుక్రవారం విడుదలైంది. మొదటి వారాంతంలో ఊహించిన దాని కంటే మెరుగైన ప్రదర్శనను అందుకుంది. విడుదలకు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.3.50 కోట్లు రాబట్టింది. ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఈ సినిమా మొత్తం వసూళ్లు 54.50 కోట్లకు చేరాయి. శుక్రవారం తొలిరోజు ఈ సినిమా రూ.13.50 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. శనివారం ఈ చిత్రం వసూళ్లు 18 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇప్పుడు ఆదివారం ఏకంగా 23 కోట్ల రూపాయలను వసూళ్ల‌తో మూడు రోజుల‌కు 50కోట్ల క్ల‌బ్ లో అడుగుపెట్టింది.

ఫస్ట్ వీకెండ్ లోనే 'ధాకడ్' థియేటర్లను దద్దరిల్లేలా చేసింది కాబ‌ట్టి.. సోమవారానికి గల్లంతవుతుంది అంటూ బాలీవుడ్ మీడియాలు క‌థ‌నాలు వండి వార్చ‌డం విశేషం. తొలి సోమవారం ఏ సినిమా వసూళ్లు అయినా ఓపెనింగ్ డేతో పోలిస్తే 30-50 శాతం తగ్గుతాయి. కానీ శని ఆదివారాల్లో వ‌సూళ్ల‌ తీరు చూస్తే ధాక‌డ్ సోమవారం 30-40 లక్షల రూపాయల వసూళ్లు అయినా రాబట్టే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.

కంగనకు వరుసగా 5వ ఫ్లాప్

గతంలో కంగనా రనౌత్ నటించిన చిత్రం 'తలైవి'. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ షోగా నిలిచింది. జె. ఈ జయలలిత బయోపిక్ మొదటి వారాంతంలో రూ.1.09 కోట్లు రాబట్టింది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం రూ.4.75 కోట్లు వసూలు చేసింది. అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు థియేటర్లలో 50 శాతం సీట్లు బుక్ చేసుకోవాలనే నిబంధన అమల్లో ఉంది. అయినప్పటికీ ఈ రెవెన్యూ చాలా దారుణంగా క‌నిపించింది. 2019లో విడుదలైన కంగనా 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' మొదటి వారాంతంలో రూ. 39.51 కోట్లు రాబట్టింది.

ఈ సినిమా జీవితకాల వసూళ్లు రూ. 90.81 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ 99 కోట్లు అని చెప్పడంతో కంగనాకు కూడా ఈ సినిమా కొంత‌మేర నష్టాన్ని మిగిల్చింది. దీని తర్వాత 'జడ్జిమెంటల్ హై క్యా' తొలి వారాంతంలో రూ.19.19 కోట్లు రాబట్టింది. లైఫ్ టైమ్ ఆదాయం రూ.33.95 కోట్లుగా ఉంది. 'పంగా'కు జీవితకాల వసూళ్లు రూ.22.36 కోట్లు కాగా.. మొదటి వారాంతంలో రూ.10.28 కోట్లు వచ్చాయి. ఇప్పుడు ధాక‌డ్ లైఫ్ టైమ్ లో 10 కోట్లు వ‌సూలు చేసినా ఆశ్చర్య‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. కంగ‌న ధాక‌డ్ ని తొల‌గించి ఆ థియేట‌ర్ల‌ను కార్తీక్ఆర్య‌న్ సినిమాకి ఇవ్వ‌డం మ‌రీ దారుణ అవ‌మానం అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.