Begin typing your search above and press return to search.

రూ.650 కోట్ల సినిమా 60 కోట్లు వసూలు చేస్తే ఏవిధంగా హిట్ అయినట్లు..?

By:  Tupaki Desk   |   12 Sep 2022 11:33 AM GMT
రూ.650 కోట్ల సినిమా 60 కోట్లు వసూలు చేస్తే ఏవిధంగా హిట్ అయినట్లు..?
X
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ''బ్రహ్మాస్త్రం'' సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ చుట్టూ నెలకొన్న హైప్ దృష్ట్యా.. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొస్తుందని అందరూ భావించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. విమర్శకులు సైతం సానుకూలమైన రివ్యూలు ఇవ్వలేదు. అయితే నిర్మాత కరణ్ జోహార్ మాత్రం ఇది బ్లాక్ బస్టర్ అని తేల్చేశారు.

'బ్రహ్మాస్త్ర' సినిమా మొదటి రోజు రూ.75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని.. రెండు రోజుల్లో రూ.160 కోట్ల కలెక్షన్స్ దాటిందని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడింది. వసూళ్ల లెక్కలను ప్రశ్నిస్తూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీని షేర్ చేసింది. నెట్ కలెక్షన్స్ ని కాకుండా గ్రాస్ వసూళ్లను ఎందుకు పోస్ట్ చేస్తున్నారని ప్రశ్నించింది.

''నేను కరణ్ జోహార్ ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అతను ఎందుకు 'బ్రహ్మాస్త్ర' గ్రాస్ కలెక్షన్స్ ని ప్రకటిస్తున్నాడో.. నెట్ కలెక్షన్లను ఎందుకు చెప్పడం లేదు? అలాగే 60 కోట్లు అని ప్రకటించిన నెట్ వసూళ్ల సంఖ్యపై నాకు నమ్మకం లేదు. కానీ వారి ప్రకారం రెండు రోజులకి ఇండియా మొత్తం 60 కోట్లు అని నమ్మినా కూడా 650 కోట్ల సినిమా ఎలా హిట్ అయిందో కరణ్ జోహార్ జీ దయచేసి మాకు జ్ఞానోదయం చేయండి''

''ఎందుకంటే బాలీవుడ్ లో సినిమా మాఫియాకు వేర్వేరు చట్టాలు మరియు మాలాంటి మనుషులకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని నేను భయపడుతున్నాను. అందువల్ల మీలాంటి విశిష్టాధికారులకు వేర్వేరు లెక్కలు.. మాలాంటి నిరుపేదలకు వేర్వేరు లెక్కలు ఉంటాయి. దయచేసి దీనిపై మాకు అవగాహన కల్పించండి'' అంటూ కంగనా రనౌత్ సెటైరికల్ పోస్ట్ పెట్టింది.

నిజానికి 'బ్రహ్మాస్త్ర' సినిమా రిలీజ్ అయిన రోజునే కంగనా ఇదొక డిజాస్టర్ అని తేల్చేసింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ.600 కోట్లు కాల్చి బూడిద చేశారని విమర్శించింది. అతని సినీ కెరీర్లో ఒక్క మంచి చిత్రం కూడా లేదని.. అతన్ని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి క్రిటిక్స్ ఇచ్చిన రేటింగ్స్ ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. నిర్మాత కరణ్ జోహార్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

''అయాన్ ముఖర్జీని మేధావి అని మెచ్చుకున్న వారందర్నీ జైలుకు పంపించాలి. 'బ్రహ్మాస్త్ర' తెరకెక్కించడానికి అతనికి 12 ఏళ్లు పట్టింది. ఈ సినిమాను 400 రోజులకుపైగా షూట్ చేసి..14 మంది సినిమాటోగ్రాఫర్లను.. 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చాడు. ప్రొడక్షన్స్ ఖర్చుల రూపంలో మొత్తంగా రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. 'బాహుబలి' సక్సెస్ కావడంతో 'బ్రహ్మాస్త్ర' సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా చివరి నిమిషంలో మార్చి మతపరమైన మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి అవకాశవాదులు - సృజనాత్మకత కోల్పోయిన వ్యక్తులను మేధావి అని పిలవకూడదు''

''అతను (కరణ్ ను ఉద్దేశిస్తూ) సినిమా స్క్రిప్ట్ పై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి చేస్తుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం - టాలెంట్ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులను కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్ ఉన్న వాళ్లతో సినిమా తీస్తే సరిపోతుంది కదా'' అని కంగనా రనౌత్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

ఇక 'బ్రహ్మాస్త్ర' సినిమా విషయానికొస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించారు. అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. షారుఖ్ ఖాన్ స్పెషల్ రోల్ లో కనిపించాడు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ - స్టార్ లైట్ పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాని.. సౌత్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సమర్పించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.