Begin typing your search above and press return to search.

మీ తండ్రి ఎలా సీఎం అయ్యారో అందరికీ తెలుసు.. కంగనా ఫైర్

By:  Tupaki Desk   |   5 Aug 2020 5:15 AM GMT
మీ తండ్రి ఎలా సీఎం అయ్యారో అందరికీ తెలుసు.. కంగనా ఫైర్
X
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రేను బాలీవుడ్ హీరోయిన్, ఫైర్ బ్రాండ్ కంగనా కడిగేసింది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో ఆదిత్యఠాక్రే ప్రమేయం ఉందన్న వార్తలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ విమర్శలపై తాజాగా సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రే స్పందించారు. తన కుటుంబంపై కావాలనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సుశాంత్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. ఒకరి మరణాన్ని రాజకీయ లాభాల కోసం ఉపయోగించినందుకు ఆయన ప్రతిపక్షాలను నిందించాడు. ప్రతిపక్షాలు "మురికి రాజకీయాలు" చేస్తున్నాయని విమర్శించాడు.

ఆదిత్యఠాక్రే ‘మురికి రాజకీయాలు’ అన్న వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతాలో ఆదిత్యపై నిప్పులు చెరిగారు. " ఎవరు మురికి రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. మీ తండ్రికి సిఎం సీటు ఎలా వచ్చింది? మురికి రాజకీయాల గురించి మీరా స్పందించేది. సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పమని మీ తండ్రిని ఈ ప్రశ్నలు అడగండి." అంటూ నిప్పులు చెరిగారు.

1) సుశాంత్ ప్రియురాలు రియా ఎక్కడ ఉంది?
2) సుశాంత్ అసహజ మరణంపై ముంబై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు?
3) ఫిబ్రవరి నెలలో సుశాంత్ జీవితం ప్రమాదంలో ఉందని ఫిర్యాదు చేసినప్పుడు, ముంబై పోలీసులు దీనిని మొదటి రోజు ఆత్మహత్య అని ఎందుకు పిలిచారు?
4) హత్య జరిగిన వారంలో అందరూ అతనిని పిలిచి మాట్లాడిన ఫోరెన్సిక్ నిపుణులు.. సుశాంత్ ఫోన్ డేటాను ఎందుకు తీసుకోలేదు. ఆ డేటా ఎందుకు మిస్ అయ్యింది?
5) ఐపిఎస్ వినయ్ తివారీని దిగ్బంధం పేరిట ఎందుకు లాక్ చేశారు?
6) సిబిఐకి ఎందుకు కేసు అప్పగించకుండా భయపడుతున్నారు?
7) రియా మరియు ఆమె కుటుంబం సుశాంత్ డబ్బును ఎందుకు దోచుకున్నారు?

"ఈ ప్రశ్నలకు రాజకీయాలతో సంబంధం లేదు దయచేసి వీటికి సమాధానం ఇవ్వండి " అని కంగనా రౌనత్ సూటిగా మంత్రి ఆదిత్యా ఠాక్రేను ప్రశ్నించారు. కంగన ప్రశ్నలు ఇప్పుడు బాలీవుడ్ తోపాటు మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్నాయి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 న తన బాంద్రాలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ కేసును ప్రస్తుతం ముంబై పోలీసులు విచారిస్తున్నారు. బీహార్ లోని పాట్నాలో రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తరువాత, ఈ విషయాన్ని పరిశీలించడానికి బీహార్ పోలీసులు నగరానికి రాగా ముంబై పోలీసులు వారిని విచారణ చేయకుండా అడ్డుకోవడం దుమారం రేపింది. ఈ క్రమంలోనే ముంబై పోలీసులు, ప్రభుత్వం తీరుపై అందరూ నిప్పులు చెరుగుతున్నారు.