Begin typing your search above and press return to search.

నేనా..రాజ‌కీయాల్లోకా.. తీసుకునేవాళ్లెవ‌రు?

By:  Tupaki Desk   |   19 March 2018 4:20 AM GMT
నేనా..రాజ‌కీయాల్లోకా.. తీసుకునేవాళ్లెవ‌రు?
X
సినిమాల‌కు రాజ‌కీయాల‌కు ఉన్న లంకె తెలియంది కాదు. సినిమాల్లో వెలిగిపోయే వారు త‌ర్వాతి త‌మ మ‌జిలీగా రాజ‌కీయాల్ని ఎంచుకోవ‌టం.. అందులో రాణించిన ఉదంతాలు బోలెడ‌న్ని. అయితే.. అంద‌రూ అలా ఉంటారంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా..ఓపెన్ గా మాట్లాడే బాలీవుడ్ 'క్వీన్' కంగ‌నా లాంటోళ్ల‌కు రాజ‌కీయాలు ఏ మాత్రం సూట్ కావు. కానీ.. ఆమెను రాజ‌కీయాల్లోకి లాగేందుకు మొద‌లైన వార్త‌ల‌పై తాజాగా రియాక్ట్ అయ్యారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కంగ‌నా క‌ల‌వ‌బోతున్నార‌ని.. ఆమె రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌టం ఖాయ‌మ‌న్న మాట‌లు ఈ మ‌ధ్య‌న ఎక్కువ అయ్యాయి. తాజాగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన రైజింగ్ ఇండియా స‌మ్మిట్ లో ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ఆమె.. రాజ‌కీయాల్లోకి త‌న ఎంట్రీ సాధ్య‌మే కాద‌న్న మాటనే కాదు.. త‌న లాంటి వారిని ఏ పార్టీ తీసుకుంటుంద‌ని చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

రాజ‌కీయ రంగం అద్భుత‌మైన‌ద‌ని.. అంద‌రూ ఆ రంగం గురించి త‌ప్పుగా అనుకుంటారన్నారు. రాజ‌కీయ నేత‌ల ఫ్యాష‌న్ సెన్స్ అస్స‌లు న‌చ్చ‌ద‌న్న ఆమె.. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న వార్త‌లపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. "నేను ధ‌రించే దుస్తులు.. నేను మాట్లాడే తీరును చూసిన త‌ర్వాత ఏ రాజ‌కీయ పార్టీ తీసుకోదు. నా ఫ్యాష‌న్.. నా అభిప్రాయాల‌కు అడ్డు చెప్ప‌కుండా ఉంటే రాజ‌కీయాల్లోకి రావ‌టానికి ఎలాంటి అభ్యంత‌రం లేదు" అని ఆమె తేల్చి చెప్పారు. ఇంత ఓపెన్ గా విష‌యం చెప్పిన త‌ర్వాత‌.. ఆమెను పార్టీలోకి పిలిచే సాహ‌సం ఏ రాజ‌కీయ పార్టీ చేయ‌గ‌ల‌దు చెప్పండి?

తన‌కు మోడీ అంటే చాలా అభిమాన‌మ‌ని.. ఆయ‌న జీవితాన్ని గెలిచిన తీరు స్ఫూర్తివంతంగా ఉంటుంద‌న్నారు. ఒక చాయ్ వాలా దేశ ప్ర‌ధాని అయ్యారంటే ఆ విజ‌యం ఆయ‌న‌ది కాద‌ని.. మ‌న ప్ర‌జాస్వామ్యానిద‌న్న ఆమె.. తాను భార‌త దేశంలో పుట్ట‌ట‌మే త‌న‌కు గుర్తింపు ల‌భించ‌టానికి కార‌ణంగా చెప్పారు. మాట‌లు బాగానే ఉన్నాయ్.. రాజ‌కీయాల విష‌యంపై మ‌రోసారి ఆలోచించు కంగ‌నా.