Begin typing your search above and press return to search.

ముంబైని పీవోకేతో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   3 Sept 2020 11:02 PM IST
ముంబైని పీవోకేతో పోల్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి వ్యవహారంలో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొందరు బాలీవుడ్ హీరోలు డ్రగ్స్ తీసుకుంటారని, బాలీవుడ్ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేస్తానని కంగనా షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్‌ పార్టీల్లో డ్రగ్స్‌ వాడకం మామూలేనని కంగనా చేసిన ట్వీట్లు కలకలం రేపాయి. నార్కోటిక్స్‌ బ్యూరో విచారణ చేపడితే బాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు జైలు ఊచలులెక్కపెడతారని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే, ఆ వివరాలు వెల్లడించిన తర్వాత తనకు సినీ మాఫియా కంటే ముంబై పోలీసులంటే భయమని, వారిపై తనకు నమ్మకం లేదని, హర్యానా పోలీసులు లేదా కేంద్ర బలగాలు తనకు భద్రత కల్పించాలని కోరుతూ బీజేపీ నేతను ట్యాగ్ చేసి ట్వీట్ చేసింది.

ఈ నేపథ్యంలో కంగనపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టవద్దని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంగనా ముంబైలో ఉంటూ ముంబై పోలీసులను అవమానించిందని, దయచేసి ఆమెను ముంబై రావద్దని కోరుతున్నామని సామ్నా పత్రికల రాశారు. దీనిపై హోం శాఖ చర్యలు తీసుకోవాలని రౌత్‌ అన్నారు. సంజయ్‌ రౌత్‌ తనను బహిరంగంగా బెదిరించడంపై కంగనా రనౌత్‌ స్పందించారు. సంజయ్‌ రౌత్‌ బెదిరింపుల నేపథ్యంలో ముంబై తనకు పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లా కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది కంగన. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ముంబై పోలీసులు ట్రోలింగ్ చేయించారని ఆరోపించింది. నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తానని, భిన్న అభిప్రాయాలను గౌరవిస్తానని కంగనా చెప్పింది.మరి, కంగనా తాజా వ్యాఖ్యలపై రౌత్, ముంబై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.