Begin typing your search above and press return to search.

జైరా వేధింపుల‌పై కంగ‌నా రియాక్ష‌న్ ఏంటంటే!

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:30 PM GMT
జైరా వేధింపుల‌పై కంగ‌నా రియాక్ష‌న్ ఏంటంటే!
X
దంగ‌ల్ గ‌ర్ల్ జైరా వాసీంకు ఎయిర్ విస్తారా ఫ్లైట్ లో ఎదురైన లైంగిక వేధింపుల ఘ‌ట‌న సంచ‌ల‌న సృష్టించిన సంగ‌తి తెలిసిందే. బాలుర‌కు బాలిక‌లు ఏమాత్రం తీసిపోర‌ని నిరూపించిన గీతా ఫొగ‌ట్ జీవిత చ‌రిత్ర ఆధారంగా బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ తెర‌కెక్కించిన హిట్ మూవీ *దంగ‌ల్‌*లో చిన్నారి ఫోగ‌ట్ పాత్ర‌లో క‌నిపించిన జైరా వాసీం... బార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌ను ఇట్టే ఆక‌ట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మ‌ట్టిపై ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగుల్లో వాసీం దెబ్బ‌కు బాలురంతా బ‌య‌ట‌కు క్యూ క‌ట్టేసిన సీన్లు మ‌న క‌ళ్ల ముందు ఇంకా క‌ద‌లాడుతూనే ఉన్నాయి. అలాంటి సందేశాత్మ‌క పాత్ర‌లో న‌టించిన వాసీం... ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు విస్తారా విమానాన్ని ఎక్క‌గా... ఆమె సీటు వెనుకాలే కూర్చున్న ఓ మ‌గ మ‌హానుభావుడు ఆమెను లైంగికంగా వేధించాడు. దీనిపై తీవ్ర మాన‌సిన వేద‌న‌కు గురైన వాసీం... మొత్తం ఆ ఎపిసోడ్‌ ను వివ‌రిస్తూ క‌న్నీటిప‌ర్యంత‌మవుతూ తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీనిపై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌గా..కాస్తంత ఆల‌స్యంగానైనా... బాలీవుడ్ లేడీ డాన్‌గా మారిన ప్ర‌ముఖ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ చాలా ఘాటుగా స్పందించారు. తానైతే... ఆ మృగాడి కాళ్లు న‌రికేసేదానిని అంటూ కంగ‌నా చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారిపోయాయి. త‌న‌కు న‌చ్చ‌క‌పోతే... ఎంత‌టి స్టార్ హీరోనైనా పూచిక పుల్ల‌లా తీసివేసే ల‌క్ష‌ణ‌మున్న కంగ‌నా చాలా సంద‌ర్భాల్లో పెద్ద వివాదాల‌నే రేకెత్తించింది. బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్‌ను అయితే ఆమె ఓ ఆటాడుకున్నార‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో ఇప్పుడు జైరా ఘ‌ట‌న‌పై కంగ‌న స్పందించిన తీరు నిజంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది. జైరాపై వేధింపుల‌కు పాల్ప‌డ్డ వ్య‌క్తి ఇప్ప‌టికే అరెస్ట్ కాగా... అత‌డిని ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు తెర వెనుక చాలా య‌త్నాలే సాగుతున్నాయ‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో జోక్యం చేసుకున్న కంగ‌నా ఫైర్ అయిపోయారు.

అయినా కంగ‌నా ఏమ‌న్నారంటే... *జైరా వసీంను విమానంలో వేధించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేయడం అభినందించాల్సిన విషయం. కానీ ఆ వ్యక్తిని కేసును తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జైరానే ఆ వ్యక్తిని అపార్థం చేసుకొన్నది అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. జైరా మీద ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా బాధగా ఉంది. బాధితురాలిని తప్పుపట్టడం ఎంత వరకు సమంజసం. లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తిని తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. జైరా వసీంను వేధించిన వ్యక్తి చాలా అమాయకుడు అని కితాబు ఇస్తున్నారు. అంత అమాయకుడైతే జైరా వీపు ఎందుకు నిమిరాడో. అలా గోకకుంటే ఆ వ్యక్తిని ఊరికనే పోలీసులు అరెస్ట్ చేస్తారా? అలా ఆరోపణలు ఉన్న వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేస్తే మహిళలకు ఎక్కడైనా భద్రత ఉంటుందా? తమపై లైంగిక దాడికి పూనుకొన్న వ్యక్తిపై ఫిర్యాదు చేయడం, వారి చర్యలను బయటపెట్టే హక్కు మహిళలకు లేదా? అదే నేనైతా ఆ వ్యక్తి కాలిని విరగకొట్టే దానిని* అని కంగ‌నా త‌న‌దైన స్టైల్లో ఘాటుగా రియాక్ట్ అయ్యారు.