Begin typing your search above and press return to search.

మామ‌కి త‌గ్గ కోడ‌లే!

By:  Tupaki Desk   |   28 Nov 2015 11:30 AM GMT
మామ‌కి త‌గ్గ కోడ‌లే!
X
శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. ద‌ర్శ‌కేంద్రుడిగా కీర్తికెక్కారు. ఆయ‌న మార్క్‌ తో సినిమాలు తీయాల‌ని ఎంతో మంది ప్ర‌య‌త్నిస్తుండొచ్చు కానీ... అలా ఎవ్వ‌రికీ సాధ్యం కాలేదు. త‌న‌కి మాత్ర‌మే సాధ్య‌మేమో అన్న‌ట్టుగా ప్ర‌తీ చిత్రాన్ని ఒక దృశ్య‌కావ్యంలా తీస్తుంటారు రాఘ‌వేంద్ర‌రావు. అయితే ఆయ‌న త‌న‌యుడు ప్ర‌కాష్ ద‌ర్శ‌కుడు అవుతున్నాడ‌నేస‌రికి అంద‌రూ రాఘ‌వేంద్ర‌రావుని చూసిన కోణంలోనే చూశారు. తండ్రిలాగే ఈయ‌న కూడా పాలు పండ్లతో తెర‌పై మేజిక్ సృష్టిస్తాడేమో అనుకొన్నారంతా. కానీ ప్ర‌కాష్ శైలి పూర్తి భిన్నం అని బొమ్మ‌లాట చూశాకే తెలిసింది. అన‌గ‌న‌గా ఒక ధీరుడుతోనూ త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన మార్క్‌ ని సృష్టించుకొన్నా అని చాటి చెప్పాడు ప్ర‌కాష్. అయితే తండ్రిలాంటి దూకుడు మాత్రం ఆయ‌నలో క‌నిపించ‌లేదు. ఇక రాఘ‌వేంద్ర‌రావులా సినిమాలు తీసే ఆయ‌న వార‌సులు ఇక ఎవ్వ‌రూ లేర‌ని ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రేక్ష‌కులు.

అయితే ఇప్పుడు మామ‌కి త‌గ్గ కోడ‌లిగా రాఘ‌వేంద్ర‌రావు వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకోవ‌డానికి వ‌చ్చిన‌ట్టుంది క‌నికా కోవెల‌మూడి. సైజ్‌ జీరో చిత్రం చూశాక చాలామందిలో అదే అభిప్రాయం క‌లిగింది. సినిమా చూసిన‌వాళ్లు క‌థేం లేదే అని పెద‌వి విరిచిన‌ప్ప‌టికీ ఉన్న ఆ చిన్న క‌థ‌ని కూడా ప‌క్కాగా రాసుకుంది క‌నిక‌. ఆమె స్క్రిప్టుని డీల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. తొలి ప్ర‌య‌త్నంగా రాసిన క‌థే ఇలా ఉంది. సైజ్‌ జీరోతో అనుభ‌వం వ‌చ్చుంటుంది, తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచులు ఎలాంటివో తెలిసుంటుంది. త‌ప్పొప్పుల్ని బేరీజు వేసుకొనుంటుంది కాబ‌ట్టి మునుముందు ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి. క‌నికకి ద‌ర్శ‌కురాలు అవ్వ‌డ‌మే ల‌క్ష్యం. భవిష్య‌త్తులో ఆమె మెగాఫోన్ కూడా ప‌ట్టే అవ‌కాశాలున్నాయి. రాఘవేంద్రరావు త‌ర‌హాలో క‌నిక సినిమాలు తీస్తుందేమో చూడాలి.