Begin typing your search above and press return to search.

పునీత్ చివరి ట్వీట్: అన్న సినిమాకు శుభాకాంక్షలు తెలిపి.. అంతలోనే లోకాన్ని విడిచాడు..!

By:  Tupaki Desk   |   29 Oct 2021 12:30 PM GMT
పునీత్ చివరి ట్వీట్: అన్న సినిమాకు శుభాకాంక్షలు తెలిపి.. అంతలోనే లోకాన్ని విడిచాడు..!
X
శాండిల్ వుడ్ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తన సినిమాలతో ఇన్నాళ్ళు అలరించిన పునీత్.. గుండెపోటుతో హఠాత్మరణం చెందడం అందరినీ కలచివేస్తోంది. ఈ రోజు శుక్రవారం ఉదయం జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా 9.45 గంటలకు హార్ట్ ఎటాక్ రావడంతో బెంగళూరులోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ హాస్పిటల్ కు తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి పునీత్ తుదిశ్వాస విడిచారు.

అయితే జిమ్ లో వ్యాయామం చేయడానికి ముందు, అంటే ఉదయం గం. 7.33 నిమిషాలకు పునీత్ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈరోజు తన అన్న శివ రాజ్ కుమార్ నటించిన ''భజరంగీ 2'' సినిమా కన్నడ తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ''#భజరంగీ 2 టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు'' అని ట్వీట్ చేసిన పునీత్.. సోదరుడు శివన్న మరియు దర్శక నిర్మాతలను ట్యాగ్ చేశారు. ఇదే కన్నడ పవర్ స్టార్ చివరి ట్వీట్ గా నిలిచింది.

అన్న సినిమాకు శుభాకాంక్షలు తెలిపి.. అంతలోనే పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ మరణాంతరం ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చివరి ట్వీట్స్ - ఇంటర్వ్యూలను వెతకడంతో అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పునీత్ మరణం వార్తను జీర్ణించుకోలేని కొందరు ఫ్యాన్స్ ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో కర్ణాటకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఇక అభిమాన హీరో కడచూపు కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం పునీత్‌ పార్థీవ దేహాన్ని బెంగళూరు కంఠీరవ స్టేడియంలో ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పునీత్‌ రాజ్‌ కుమార్‌ మృతదేహాన్ని స్టేడియం వద్దకు తరలిస్తున్నారు.

కాగా, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పునీత్ రాజ్‌ కుమార్ శాండిల్ వుడ్ లో తిరుగులేని స్టార్ డమ్‌ సంపాదించుకున్నారు. హీరోగా, సింగర్ గా, టీవీ హోస్ట్ గా.. ఆడియో కంపెనీ ఓనర్ గా, నిర్మాతగా.. ఇలా ఎన్నో రంగాల్లో కన్నడ చిత్ర పరిశ్రమకు పునీత్ సేవలందించిన సంగతి తెలిసిందే.