Begin typing your search above and press return to search.

కాంతార ఓటీటీ ఎప్పుడు? ఎందుకు లేట్ అవుతోంది?

By:  Tupaki Desk   |   13 Nov 2022 11:30 PM GMT
కాంతార ఓటీటీ ఎప్పుడు? ఎందుకు లేట్ అవుతోంది?
X
భాషలతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతి చోట దుమ్ము దులిపేస్తూ.. కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది కాంతార మూవీ. కన్నడలోవిడుదలైన ఈ మూవీ ఇప్పటికి రూ.350 కోట్ల కలెక్షన్ మార్కును దాటేయటమే కాదు.. త్వరలో రూ.400 కోట్లు దాటేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏమాత్రం అంచనాలు లేని రీతిలో సిద్ధమైన ఈ మూవీ.. ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందన్న ఆలోచన చిత్ర నిర్మాతలకు కూడా లేని పరిస్థితి.

ప్రమోషన్ లు పెద్దగా లేకుండా.. కేవలం మౌత్ టాక్ తో.. సోషల్ మీడియా బజ్ తో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావటమే కాదు.. మరిన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్లు సిద్ధమవుతున్నారు. కన్నడలో విడుదలై.. సినిమా బాగుందన్న పేరు వచ్చినంతనే తెలుగు.. మలయాళం.. తమిళం.. హిందీల్లో ఈ సినిమాను డబ్ చేయటం తెలిసిందే. ఈ మూవీ విడుదలై వారాలకువారాలు గడుస్తున్నా.. ఓటీటీ ఫ్లాట్ పాం మీదకు మాత్రం రాని పరిస్థితి.

కన్నడలో ఈ సెప్టెంబరు30న విడుదలైన ఈ మూవీ.. చాలా తక్కువ వ్యవధిలోనే తెలుగులోనూ విడుదల చేశారు. తెలుగు విడుదలే చూసుకుంటే.. అక్టోబరు 15నఈ మూవీ విడుదలైంది. అంటే.. ఈ రోజుకు రెండు రోజులకు తక్కువగా నెల రోజులు. అయినప్పటికీ ఇప్పటికి తెలుగులో ఈ సినిమాను ప్రదర్శిస్తున్న స్క్రీన్లు ప్రేక్షకులతో నిండుతున్నాయి. ఓటీటీలో చూద్దాంలే అనుకున్న వారు సైతం.. థియరేటికల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ సినిమాను వెండి తెర మీదన చూసేందుకు మక్కువ చూపుతున్నారు.

ఇదిలా ఉంటే.. సినిమా విడుదలైన ఇన్ని రోజులు అయినా.. ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. నవంబరు మొదటి వారానికి తెలుగులో రూ.50 కోట్ల కలెక్షన్ మార్కును టచ్ చేసిన ఈ మూవీ ఇప్పుడు రూ.60 దాటేసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో థియేటర్ లో విడుదలైన పది రోజులకు లేదంటే రెండు వారాలకే ఓటీటీల్లో హడావుడి చేస్తున్న సినిమాలకు భిన్నంగా కాంతార మాత్రం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు ఆలస్యమవుతోంది.

ఇంత క్రేజీ సినిమాను ఓటీటీలో విడుదల చేయకుండా అమెజాన్ ప్రైమ్ సైతం ఎందుకు ఆగుతుంది? అన్నది మరో ప్రశ్న. విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒప్పందంలో భాగంగాఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ.. థియేటర్ కలెక్షన్లు డ్రాప్ కాని నేపథ్యంలో మరికొంత కాలం వెయిట్ చేద్దామని ప్రైమ్ ను నిర్మాతలు కోరినట్లు చెబుతున్నారు. ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్.. చేతిలో మరిన్ని ప్రతిష్ఠాత్మకచిత్రాలు ఉండటం.. వాటిని తమ ఓటీటీల్లోకి తీసుకొచ్చేందుకు ప్రైమ్ ఆసక్తి చూపుతోంది. ఈ కారణంతోనే నిర్మాతల రిక్వెస్టును ఓకే చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ మధ్యన కూడా ఈ మూవీని ఓటీటీల్లో నవంబరు 18న విడుదల చేయాలని భావించారు. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు ఉన్నందున.. మరికొంత కాలం వెయిట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలో హిందీలో సింగిల్ డే అత్యధికంగా రూ.4.5 కోట్లు కలెక్షన్ ను కొల్లగొట్టిన మూవీగా కాంతార నిలిచింది. అందుకే.. మరికొంత కాలం ఆగిన తర్వాతే ఓటీటీకి తీసుకొస్తారని చెబుతున్నారు. కాంతారకు అంచనాలు లేని వేళలో.. ప్రైమ్ కొనుగోలు చేయటం.. అప్పట్లో దాని మీద పెట్టిన పెట్టుబడికి.. ఎప్పుడు విడుదల చేసినా పక్కా విజయం ఖాయమని తేలిన నేపథ్యంలో.. ప్రైమ్ సైతం నిర్మాతల రిక్వెస్టును మన్నించి.. ఆ సంస్థతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తుందంటున్నారు. అందుకే.. ఓటీటీల్లో ఈ మూవీని చూడాలనుకున్న వారు మరింత కాలం వెయిట్ చేయక తప్పదన్న మాట వినిపిస్తోంది.