Begin typing your search above and press return to search.

రాజమౌళి మరో చరిత్ర సృష్టించడం ఖాయం: కరణ్ జొహార్

By:  Tupaki Desk   |   18 Dec 2021 10:31 AM GMT
రాజమౌళి మరో చరిత్ర సృష్టించడం ఖాయం: కరణ్ జొహార్
X
బాలీవుడ్ బడా నిర్మాతలలో ఎక్కువగా వినిపించే పేరు కరణ్ జొహార్. భారీ సినిమాలను నిర్మించే నిర్మాతలు అక్కడ చాలామంది ఉన్నప్పటికీ, ఒక దర్శకుడితోను .. హీరోతోను సమానంగా కరణ్ జొహార్ మీడియా ముందుకు వస్తుంటారు .. వేదికలపై సందడి చేస్తుంటారు. అందువలన కరణ్ జొహార్ పేరు జనం నోట్లో నానుతూనే ఉంటుంది. ఇక బాలీవుడ్లో ఆర్టిస్టుల కాంబినేషన్ ను సెట్ చేయడంలో కూడా ఆయన తరువాతనే ఎవరైనా అనే పేరు కూడా ఉంది. అక్కడ సినిమాలకి సంబంధించిన ఏ పనైనా కరణ్ ని కలిస్తే అయిపోతుందని కాన్ఫిడెంట్ గా చెబుతుంటారు.

అలాంటి కరణ్ తన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి 'బ్రహ్మాస్త్ర'ను సిద్ధం చేస్తున్నారు. పురాణాలలో 'బ్రహ్మాస్త్రం' గురించిన ప్రస్తావన ఉంటుంది. ఎంతటివారైనా ఆ అస్త్రాన్ని గౌరవించి లొంగిపోవాలే తప్ప, దానికి వ్యతిరేకంగా మరో అస్త్రాన్ని ప్రయోగించకూడదు .. అదే దాని ప్రత్యేకత. తిరుగులేని అస్త్రమంటే ఇదే. అలాంటి టైటిల్ తో వస్తున్న కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమాకి, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. అమితాబ్ .. రణ్ బీర్ కపూర్ .. అలియా భట్ .. నాగార్జున ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ హైదరాబాద్ లో జరిగింది.

రాజమౌళి .. నాగార్జున సమక్షంలో, రణ్ బీర్ కపూర్ - అలియాతో కలిసి కరణ్ జొహార్ ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "ఇంతకుముందు నేను చాలా సినిమాలను నిర్మించాను .. వాటి గురించి మాట్లాడాను. ఈ సినిమా విషయంలో నేను చెప్పేది ఒక్కటే .. ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా నిర్మాణానికి ఏడేళ్లు పట్టడానికి కారణం ఆ ప్రత్యేకతనే. ఏడేళ్లుగా ఈ సినిమా కోసం రణ్ బీర్ ఎంతో ఆత్రుతతో .. ఆరాటంతో ఎదురుచూస్తున్నాడు. ఇక ఈ సినిమాను మొదలుపెట్టినప్పుడు అలియా భట్ కి ఇండస్ట్రీ కొత్త .. ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అమితాబ్ .. రణ్ బీర్ .. అలియా లేకపోతే ఈ సినిమానే లేదు. 'బాహుబలి' కోసం ప్రభాస్ - రానా ఎంతగా తమ కెరియర్ ను అంకితం చేశారో, అలాగే ఈ సినిమా కోసం వీరంతా అంకితమై పనిచేశారు. అందుకు వాళ్లకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నాగార్జున గారు అందించిన సహకారం మరిచిపోలేనిది. ఈ సినిమా కోసం దర్శకుడు అయాన్ ఎంతో కష్టపడ్డాడు .. ఈ సినిమాకి ఒక దర్శకుడిగానే కాకుండా నా సొంత బ్యానర్లో ఒక కీలకమైన వ్యక్తిగా కూడా ఆయన మారిపోయాడు. అందరం కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా కోసం కష్టపడ్డాం. అందుకు తగిన ఫలితం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాము.

రాజమౌళిగారి విషయానికి వస్తే ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. ఆయన దర్శకత్వం వహించిన 'ఈగ' సినిమాను చూస్తూ .. సీట్లో నుంచి లేచి చప్పట్లు కొట్టినవాడిని నేను. 'ఈగ'తోనే ఇంత అద్భుతమైన సినిమా తీస్తే, మనుషులతో మరెలాంటి సినిమా తీస్తాడో అనుకున్నాను. అనుకున్నట్టుగానే 'బాహుబలి' వంటి సినిమాను తీశారు. ఈ సినిమాతో తెలుగు సినిమా గొప్పతనాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు ఇవ్వమని కోరితే ఇచ్చారు. అలా హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం నాకు లభించింది.

కెరియర్ పరంగా నాకు .. రాజమౌళి గారికి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. ఆయన ఫస్టు మూవీ 'స్టూడెంట్ నెంబర్ 1' అయితే .. నేను 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాను తీశాను. అయితే ఒకటి .. ఆయన మాదిరిగా నేను సినిమాలు చేయలేను .. ఆ స్థాయి వసూళ్లను రాబట్టలేను. ఆయనతోనే ఇక్కడ ప్యాన్ ఇండియా సినిమా అనే మాట వినిపిస్తోంది. అలాంటి రాజమౌళిగారు ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేశారు. ఈ సినిమా మరో చరిత్రను సృష్టించడం ఖాయం .. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా కోసమే నేను కూడా వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.