Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ జోహార్ జీ... సింగ‌ర్ ఆరోప‌ణ‌లో నిజం ఎంత‌?

By:  Tupaki Desk   |   24 May 2022 3:52 AM GMT
క‌ర‌ణ్ జోహార్ జీ... సింగ‌ర్ ఆరోప‌ణ‌లో నిజం ఎంత‌?
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ మూవీపై పాపుల‌ర్ సింగ‌ర్ కాపీ రైట్ ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. టీసిరీస్ తో క‌లిసి క‌ర‌ణ్ నిర్మిస్తున్న `జగ్ జగ్ జీయో`పై ఈ ఆరోప‌ణ‌లు చెల‌రేగాయి. పాకిస్థానీ గాయకుడు అబ్రార్ ఉల్ హక్ కరణ్ జోహార్ తన పాటను కాపీ చేశారని ఆరోపించాడు. వెంట‌నే దీనికి కౌంట‌ర్ గా టీ-సిరీస్ స్పందించింది.

నాచ్ పంజాబన్ కి ఒరిజిన‌ల్ గాయకుడు అబ్రార్ ఉల్ హక్ ధర్మ ప్రొడక్షన్ తన అనుమతి లేకుండా తన పాటను కాపీ చేసిందని పేర్కొనడంతో ఇది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిది. `జగ్ జగ్ జీయో` ట్రైలర్ ఆదివారం విడుదల కాగా.. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇందులో తార‌ల నటనను ప్ర‌త్యేకించి అభినందిస్తున్నారు. మరికొందరు ట్రైలర్ లోని అద్భుతమైన సంగీతాన్ని అభినందిస్తున్నారు. ట్రైలర్ లో పాపుల‌ర్ సాంగ్ `నాచ్ పంజాబన్` చాలా మందిని ఆకర్షించింది. అయితే ఈ పాట ఒరిజినల్ వెర్షన్ గాయకుడు అబ్రార్ ఉల్ హక్ తన పాటను T-సిరీస్ అనే మ్యూజిక్ లేబుల్ దొంగిలించింద‌ని ఆరోపించారు. తాజాగా అక్బ‌ర్ ఉల్ హక్ వాదనలపై T-సిరీస్ ఖండ‌న‌తో కూడుకున్న ప్రకటనను విడుదల చేసింది. తన `నాచ్ పంజాబన్` పాటను కాపీ చేసార‌ని ఆరోపించిన పాకిస్తానీ సంగీతకారుడు అబ్రార్ ఉల్ హక్ చేసిన దోపిడీ వాదనలు స‌రికాద‌ని T-సిరీస్ ఖండించింది.

వరుణ్ ధావన్ - అనిల్ కపూర్- నీతూ కపూర్ - కియారా అద్వానీ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రం ట్రైలర్ లో హక్ పాడిన పాపుల‌ర్ 2002 ట్రాక్ కి పునఃసృష్టి వెర్షన్ హాట్ టాపిక్ అయ్యింది. ఆదివారం ట్రైలర్ లాంచ్ అయిన వెంటనే సంగీతద‌ర్శ‌కుడు ట్విట్టర్ లో తన పాటను ఏ భారతీయ సినీ నిర్మాతలకు విక్రయించలేదని రాశారు. కాపీరైట్ ఉల్లంఘన అని దావా వేస్తాన‌ని.. ధర్మ ప్రొడక్షన్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హక్ బెదిరించారు.

``నేను నా `నాచ్ పంజాబన్` పాటను ఏ భారతీయ చిత్రానికి హ‌క్కులు విక్రయించలేదు. నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్లే హక్కులను నేను కలిగి ఉన్నాను. కరణ్‌జోహార్ వంటి నిర్మాతలు కాపీ పాటలను ఉపయోగించకూడదు. ఇప్ప‌టికి ఇది నా 6వ పాట కాపీ కొట్టారు. ఇలాంటివి ఇక్క‌డ‌ అనుమతించం`` అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే దీనికి కౌంట‌ర గా టిసిరీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో .. హక్ వాదనలను తోసిపుచ్చుతూ ఒక నోట్ ను పోస్ట్ చేసింది. UK-ఆధారిత మూవీబాక్స్ రికార్డ్స్ లేబుల్ ట్రాక్ హక్కులను కలిగి ఉండటంతో ఈ పాట హ‌క్కుల‌ను వారి నుంచి ``చట్టబద్ధంగా పొందాం`` అని T-సిరీస్ తెలిపింది. 2002 జనవరి 1న ఐ ట్యూన్స లో విడుదలైన నాచ్ పంజాబన్ ఆల్బమ్ నుండి నాచ్ పంజాబన్ పాటను స్వీకరించడానికి మేము చట్టబద్ధంగా హక్కులను పొందాము. జగ్ జగ్ జీయో చిత్రం కోసం మూవీబాక్స్ రికార్డ్స్ లేబుల్ యాజమాన్యంలో.. నిర్వహించబడుతున్న లాలీవుడ్ క్లాసిక్ ల యూట్యూబ్ ఛానెల్ లో కూడా అందుబాటులో ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ దీనిని నిర్మించింది`` అని ప్రకటనలో పేర్కొంది.

ఈ పాట అధికారికంగా విడుదలైనప్పుడు వివరణాత్మక క్రెడిట్ లు చేరుస్తామ‌ని మ్యూజిక్ లేబుల్ తెలిపింది. పాట విడుదలైనప్పుడు అన్ని ప్లాట్ ఫారమ్ లలో అన్ని బకాయి ఉన్న పేర్ల‌ను క్రెడిట్స్ లో చేరుస్తాం. మూవీబాక్స్ రికార్డ్స్ లేబుల్ ద్వారా సూచించబడిన పాటల కాపీరైట్స్ ప్రత్యేకంగా అన్నివిధాలా చెల్లుబాటు అయ్యే పత్రాలతో మూవీబాక్స్ తో మాత్రమే ఉంటాయి`` అని వివ‌రణాత్మ‌క సందేశాన్ని జోడించింది.

ఆదివారం సాయంత్రం ట్విట్టర్ పోస్ట్ లో మూవీబాక్స్ రికార్డ్స్ లేబుల్ కూడా హక్ వాదనలను ఖండించింది. అతని ఆరోపణ ``పరువు నష్టం కలిగించేది`` అని పేర్కొంది. నాచ్ పంజాబ‌న్ పాట‌ని టీసిరీస్ జ‌గ్ జ‌గ్ జియో చిత్రంలో చేర్చడానికి అధికారికంగా లైసెన్స్ పొందింది. క‌ర‌ణ్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఈ పాటను తమ చిత్రంలో ఉపయోగించుకోవడానికి చట్టబద్ధమైన హక్కులు కలిగి ఉంది. అక్బ‌ర్ ఉల్ హ‌క్ చేసిన ట్వీట్ పరువు నష్టం కలిగించేది. పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. అయితే మూవీబాక్స్ రికార్డ్స్ లేబుల్ ట్వీట్ తర్వాత తన పాట ఎవరికీ లైసెన్స్ ఇవ్వలేదు అని హక్ పోస్ట్ చేశాడు. ``ఎవరైనా దానిని క్లెయిమ్ చేస్తుంటే.. అగ్రిమెంట్ ను సమర్పించండి. నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను`` అని టీసిరీస్ ట్వీట్ కౌంట‌ర్ వేసింది. జగ్‌జగ్ జీయో జూన్ 24న విడుదల కానుంది.