Begin typing your search above and press return to search.

కరణ్ జోహార్ అంతకు దిగజారాడా?

By:  Tupaki Desk   |   2 Sep 2016 9:30 AM GMT
కరణ్ జోహార్ అంతకు దిగజారాడా?
X
బాలీవుడ్లో సినిమాల ప్రచారానికి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్ కూడా కేటాయిస్తారు. ఐతే అందులో పోటీగా వచ్చే సినిమాలపై నెగెటివ్ ప్రచారం చేయడానికి కూడా కొంత బడ్జెట్ కేటాయిస్తారని ఇప్పుడే తెలుస్తోంది. అజయ్ దేవగణ్ ఆరోపణల ప్రకారం.. అతడి సినిమా ‘శివాయ్’కు నెగెటివ్ ప్రచారం చేయడానికి కరణ్ జోహార్ రూ.25 లక్షలు కేటాయించాడు. సోషల్ మీడియాలో బాలీవుడ్ నటుల గురించి.. బాలీవుడ్ సినిమాల గురించి పిచ్చివాగుడు వాగే కమల్ ఆర్.ఖాన్.. తన సినిమా గురించి వ్యతిరేక ప్రచారం చేయడానికి రూ.25 లక్షలు తీసుకున్నట్లుగా అజయ్ ఆరోపిస్తున్నాడు. ఈ సంగతి కమల్ స్వయంగా చెబుతుండగా రికార్డు చేసిన ఆడియో క్లిప్ ను అతను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

కరణ్ జోహారే డబ్బులిచ్చినట్లు చెప్పలేదు కానీ.. ఈ వ్యవహారంలో అతడి ప్రమేయం ఎంతుందో విచారణ జరిపించాలని అజయ్ డిమాండ్ చేశాడు. కమాల్ ఆర్.ఖాన్ లాంటి వాళ్లు చేస్తున్న పనులు తనకెంతో బాధ కలిగిస్తున్నాయని.. ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ఇండస్ట్రీ నాశనానికి సపోర్ట్ చేయడం బాధాకరమని అజయ్ అన్నాడు. శివాయ్ సినిమాతో పాటుగా కరణ్ జోహార్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’ కూడా అక్టోబరు 28నే రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ‘శివాయ్’ను దెబ్బ తీయడానికి కరణ్ ఇలా వ్యతిరేక ప్రచారం ప్లాన్ చేసినట్లుగా అజయ్ భావిస్తున్నాడు. ఈ ఆరోపణల సంగతేమో కానీ.. కాంట్రవర్శీల ద్వారానే ఎదిగిన కమల్ ఆర్.ఖాన్ కు మాత్రం ఈ వివాదం భలే సంతోషాన్ని కలిగిస్తున్నట్లుంది.