Begin typing your search above and press return to search.

ఇన్నాళ్టికి బాలీవుడ్ జేజ‌మ్మ క‌బర్‌

By:  Tupaki Desk   |   21 Sep 2019 5:30 AM GMT
ఇన్నాళ్టికి బాలీవుడ్ జేజ‌మ్మ క‌బర్‌
X
ద‌క్షిణాది సినిమాకి మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టింద‌ని చెప్పొచ్చు. బాహుబ‌లి త‌ర్వాత టాలీవుడ్ లో ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌న సినిమాల్ని వెతుక్కుంటూ వ‌చ్చి మ‌రీ రీమేక్ లు చేస్తున్నారు హిందీ జ‌నం. ఆ కోవ‌లోనే ఇప్ప‌టికే ప‌లు టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ల రీమేక్ రైట్స్ ని హిందీ ఫిలింమేక‌ర్స్ చేజిక్కించుకున్నారు. తెలుగులోనూ హిందీ సినిమాల‌ రీమేక్ లు పెరిగాయి. మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు హిందీ చిత్రాల రీమేక్ హ‌క్కుల్ని కొనుక్కుంటున్నారు.

దాదాపు ద‌శాబ్ధం క్రితం రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `అరుంధ‌తి` చిత్రాన్ని ఇప్ప‌టికే బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగాయి. అయితే వాట‌న్నిటికీ ఆదిలోనే ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఇబ్బంది ఎదురైంది. ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ చేజిక్కించుకుని ఆ ప్ర‌య‌త్నాన్ని మ‌ధ్య‌లోనే ఆపేశారు. అయితే ప్ర‌స్తుతం తెలుగు సినిమా హ‌వా చూశాక మ‌న‌సు మారింద‌ట‌. ఇంత‌కాలానికి అరుంధ‌తి రీమేక్ ని తెర‌కెక్కించేందుకు స‌ద‌రు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంద‌ని తెలిసింది. ఇద్ద‌రు ప్ర‌ముఖ నిర్మాత‌లు క‌లిసి చేయాల‌న్న‌ది ప్లాన్. ఈ చిత్రంలో జేజ‌మ్మ‌గా న‌టించిన అనుష్క పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌దానిపైనా క‌స‌ర‌త్తు సాగుతోంది.

అన్నీ కుదిరితే ఈ పాత్ర‌లో బెబో క‌రీనాక‌పూర్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే త‌న వ‌ద్ద‌కు వెళ్లాల‌ని ప్రపోజ‌ల్ రెడీ చేశార‌ట‌. ఆస‌క్తి క‌న‌బ‌రిస్తే త‌న‌తో సినిమా చేసేందుకు మేక‌ర్స్ సిద్ధంగా ఉన్నార‌ట‌. ఒక‌వేళ తాను కాదు అనుకుంటే అనుష్క శ‌ర్మ‌ను సంప్ర‌దించే వీలుంద‌ని చెబుతున్నారు. క‌రీనా ఇప్ప‌టికే ఓవైపు భారీ చిత్రాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు బుల్లితెర హోస్ట్ గా ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో బిజీ అవుతున్నారు. త‌క్త్-గుడ్ న్యూస్‌- అంగ్రేజీ మీడియం వంటి చిత్రాల్లో న‌టిస్తున్న క‌రీనా త‌న కాల్షీట్ల‌ను కేటాయించాలంటే ఇంకో ఏడాది పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. అలాంట‌ప్పుడు ఆ ఛాయిస్ అనుష్క శ‌ర్మ‌కే వెళ్లే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు భావిస్తున్నారు. హిందీలో ఎవ‌రు చేసినా శ్యాంప్ర‌సాద్ రెడ్డి త‌ర‌హాలో ఎంతో ప్యాష‌నేట్ గా చేస్తేనే పెద్ద స్థాయికి రీచ్ అవుతుంది. ప‌దేళ్ల నాటితో పోలిస్తే టెక్నాల‌జీ ప‌రంగా వీఎఫ్ ఎక్స్ ప‌రంగా చాలా మార్పులొచ్చాయి. ఇప్ప‌టి స్టాండార్డ్స్ లో పాన్ ఇండియా సినిమాగా తీయాల్సి ఉంటుంది.