Begin typing your search above and press return to search.

స్టార్ బ్రదర్స్ ఒకే సినిమాలో

By:  Tupaki Desk   |   31 Jan 2016 3:30 PM GMT
స్టార్ బ్రదర్స్ ఒకే సినిమాలో
X
సూర్య, కార్తి.. అటు తమిళంలో, ఇటు తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించున్న కథానాయకులు. సూర్య దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతుండగా.. దశాబ్దం కిందట ఇండస్ట్రీలోకి వచ్చి త్వరగానే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఐతే అన్నదమ్ములిద్దరినీ కలిసి ఒకే సినిమాలో నటింపజేయడానికి ఇంతకుముందు ప్రయత్నాలు జరిగాయి కానీ.. అవి నెరవేరలేదు. ఐతే ఈ స్టార్ బ్రదర్స్ ఇద్దరూ ఈ ఏడాది తెరను పంచుకోబోతున్నారు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘సింగం-3’లో కార్తి గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కార్తి కూడా ఇందులో పోలీసాఫీసర్ పాత్రలో కాసేపు సందడి చేస్తాడట. అన్నదమ్ములిద్దరూ కలిసి ఓ పాటలో డ్యాన్స్ కూడా చేయబోతున్నట్లు సమాచారం.

సూర్యతో కలిసి నటించకపోయినా అతడితో ఓ సినిమాకు పని చేశాడు కార్తి. మణిరత్నం దగ్గర కార్తి అసిస్టెంటుగా ఉన్న టైంలో సూర్య.. ఆయనతో ‘యువ’ సినిమా చేశాడు. ముందు డైరెక్టర్ అవుదామనుకుని.. తర్వాత హీరోగా మారిన కార్తి.. అన్నయ్యలా హీరోలా నిలదొక్కుకోవడానికి పెద్దగా టైం ఏమీ తీసుకోలేదు. అతడి తొలి సినిమా ‘పరుత్తి వీరన్’ సూపర్ హిట్టవడంతో ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేకపోయింది. హరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘సింగం-3’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందులో అనుష్క - శ్రుతి హాసన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పుడు కార్తి కూడా యాడ్ అవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.