Begin typing your search above and press return to search.

చిరంజీవి 'ఖైదీ' కాదు.. కార్తీ 'ఖైదీ' ఇది!

By:  Tupaki Desk   |   24 May 2019 2:53 PM GMT
చిరంజీవి ఖైదీ కాదు.. కార్తీ ఖైదీ ఇది!
X
ప్ర‌యోగాలు చేయ‌డం కార్తీకి కొత్తేమీ కాదు. ఎంతో సెలక్టివ్ గా క‌థ‌ల్ని ఎంచుకునే కార్తీ ఇప్ప‌టికే కెరీర్ లో ఎన్నో ప్ర‌యోగాలు చేశాడు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ని ఎంచుకుంటేనే నేటి త‌రం హీరోల‌కు మ‌నుగ‌డ ఉంటుంద‌ని నిరూపించాడు. కెరీర్ ఆరంభ‌మే `ప‌రుత్తి వీర‌న్` లాంటి ప్ర‌యోగంతో సంచ‌ల‌నం సృష్టించాడు. యుగానికి ఒక్క‌డు.. ఆవారా.. నా పేరు శివ‌.. ఖాకీ ఇవ‌న్నీ ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ తో తెర‌కెక్కిన‌వే. ఈ సినిమాలు అత‌డికి న‌టుడిగానూ పేరు తెచ్చాయి. క‌మ‌ర్షియ‌ల్ గా వ‌ర్క‌వుట‌య్యాయి. ప‌క్కింట‌బ్బాయిలా క‌నిపిస్తూనే ఛాలెంజింగ్ రోల్స్ తో మెప్పించాడు. అయితే ఇటీవ‌ల తెలుగులో ఆశించిన స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకోవ‌డంలో త‌డ‌బ‌డుతున్నాడు.

తాజాగా కార్తీ మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో బ‌రిలో దిగుతున్నాడు. ఈ సినిమా టైటిల్ `ఖైదీ`. అప్ప‌ట్లో సుప్రీంహీరో చిరంజీవి న‌టించిన `ఖైదీ` తో ఏ సంబంధం లేదు. అయితే ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో జైలు ఊచ‌ల మ‌ధ్య కార్తీ లుక్ విడుద‌ల చేశారు. దానిని బ‌ట్టి అత‌డు నేరం చేసి జైల్లో ఖైదీ అవుతాడ‌ని అర్థ‌మ‌వుతోంది. త‌మిళంలో టైటిల్ ని ఖైదీ గానే పిలుస్తున్నారు కాబ‌ట్టి తెలుగులోనూ ఈ చిత్రానికి అదే టైటిల్ నే పెడ‌తారా? అన్న‌ది చూడాలి. తాజాగా రిలీజ్ చేసిన కొత్త లుక్ ఎంతో ఇంటెన్సిటీతో ఆక‌ట్టుకుంది. నెరిసిన గ‌డ్డం.. మీసం.. గుబురుగా పెరిగిన జుత్తు చూస్తుంటే ప‌గ - ప్ర‌తీకారంతో ర‌గిలిపోయే ఖైదీగా కార్తీ క‌నిపించ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఈనెల 30న ఖైదీ టీజ‌ర్ రిలీజ్ కానుంది.

ప్ర‌ఖ్యాత డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ - వివేకానంద బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆయ‌నే ర‌చ‌యిత‌. న‌రేన్- జార్జి మ‌రియాన్- ర‌మ‌ణ‌- ధీనా-యోగిబాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. `మా న‌గ‌రం` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌పై చ‌క్క‌ని అంచ‌నాలు ఉన్నాయి. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించే 64వ సినిమాకి అత‌డు క‌థ అందిస్తున్నారు. స్టోరీ రైట‌ర్ గా అత‌డికి త‌మిళ‌నాట గుర్తింపు ఉంది. అందుకే కార్తీని ఎంత కొత్త‌గా చూపించ‌బోతున్నాడో? అన్న అంచ‌నా అభిమానుల్లో ఉంది. నాలుగు గంట‌ల్లో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌న‌ల స‌మాహార‌మే ఈ సినిమా క‌థాంశం అని తెలుస్తోంది. జూలైలో సినిమా రిలీజ్ కానుంది.