Begin typing your search above and press return to search.

మనోళ్లకే ఖాళీ లేదు.. కార్తి వస్తాడంట

By:  Tupaki Desk   |   31 Aug 2017 7:09 AM GMT
మనోళ్లకే ఖాళీ లేదు.. కార్తి వస్తాడంట
X
సంవత్సరంలో ఉండే వారాలు 52. కానీ తెలుగులో ప్రతి ఏడాదీ కనీసం వంద సినిమాలైనా విడుదలవుతాయి. అంటే సగటున వారానికి రెండు సినిమాలైనా రిలీజవుతుంటాయి. కొన్నిసార్లు ఒక్క సినిమానే వస్తుంది. ఇంకొన్ని సార్లు మూడు నాలుగు సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటాయి. ఇండిపెండెన్స్ డే వీకెండ్లో ఒకే రోజు మూడు క్రేజీ సినిమాలు రిలీజైన సంగతి తెలిసిందే. ఇక సెప్టెంబరు 8న కూడా ఒకే రోజు నాలుగు సినిమాల రిలీజ్ అంటున్నారు. దసరాకు ‘స్పైడర్’.. ‘మహానుభావుడు’ మధ్య పోటీ జరగబోతోంది. ఆపై దీపావళి ముందు వీకెండ్ కోసం మూడు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి.

నాగార్జున సినిమా ‘రాజు గారి గది-2’తో పాటు రవితేజ ‘రాజా ది గ్రేట్’.. గోపీచంద్ మూవీ ‘ఆక్సిజన్’ను కూడా ఆ వీకెండ్లోనే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి తెలుగు సినిమాల మధ్యే విపరీతమైన పోటీ ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి గోపీచంద్ సినిమా రేసు నుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదు. తెలుగు సినిమాల మధ్యే ఇంత పోటీ ఉంటే.. కార్తి నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘ఖాకీ’ని కూడా అదే వీకెండ్లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కార్తి సినిమాలంటే తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతాయి. ‘ఖాకీ’ని కూడా అలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కానీ తెలుగులో ఆ సినిమాకు థియేటర్లు దొరకడం కష్టమే. తమిళ సినిమా జనాలకు దీపావళిని చాలా కీలకంగా భావిస్తారు. ఆ సీజన్లో భారీ సినిమాలు వరుస కడుతుంటాయి. దీపావళి రోజు విజయ్ సినిమా ‘మెర్సల్’ షెడ్యూల్ అయి ఉండటంతో ముందు వారమే కార్తి’ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తెలుగు రిలీజ్ కూడా కీలకమే కాబట్టి ఇక్కడ థియేటర్లు దొరక్కపోతే ఏం చేస్తారో చూడాలి.